ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ క్షణాన వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందో ఆ మరుక్షణం నుంచి పదుల సంఖ్యలో నేతలు, ఫైర్ బ్రాండ్లు ముఖం చాటేశారు..! అధికారం ఉన్నన్ని రోజులు అబ్బో వీళ్లను అస్సలు టచ్ చేయడానికి లేదు..! మీడియా ముందుకు వస్తే చాలు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటమే..! రివర్స్ కౌంటర్ చేయడానికి కూడా ప్రత్యర్థులు సాహసించేవారు కాదు. అలాంటి వారిలో మాజీ మంత్రులు రోజా సెల్వమని, విడదల రజనీ, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుతో పాటు పలువురు ఉన్నారు. వీరంతా ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్.. అదేనబ్బా అధికారం పోయాక కొన్ని రోజులు సైలెంట్ అయ్యి ఇప్పుడే మీడియా, సోషల్ మీడియా ముందుకు వస్తున్నారు. ఐతే.. రజనీ మాత్రం అడ్రెస్స్ లేరు.. ఎక్కడున్నారు..? ఏమయ్యారు..? అసలు పార్టీలో ఉన్నట్టా.. లేనట్టా..?
వేరే ఈజ్ రజనీ!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజిని హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా మేడమే.. సోషల్ మీడియాలో అంటారా ఇక చెప్పనక్కర్లేదు. ఆ ఫోటోలు, వీడియోలు ఆ లెక్కే వేరులే. ఒక్క మాటలో చెప్పాలంటే మేడం సార్ మేడం అంతే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఆర్థికంగా, రాజకీయంగా నేరుగా వైఎస్ జగన్ అండదండలు ఉండటం.. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా సపోర్ట్ చేయడంతో రజనీ రెచ్చిపోయారు. ఇదంతా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు కనీసం పోటీ చేసిన గుంటూరు పశ్చిమ నియోజవర్గ ప్రజలనే పట్టించుకున్న పాపాన పోలేదు.
కనీస స్పందన లేదేం!
వైసీపీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రజనీ పనిచేశారు. నాడు నేడులో భాగంగా స్కూల్స్, ఆస్పత్రులను ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేసిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని కూడా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది. నిజంగా ఆ టైంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు భేష్ అని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. కరోనా టైంలో ఆళ్ల నాని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా.. ఆ తర్వాత రజనీ ఆ పదవి దక్కించుకున్నారు. ఈమె హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాలు, కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలు ఇలా చాలానే జరిగాయి. కానీ పలానా చేశామని చెప్పుకోలేక పోయారు అంతే.
ఉన్నట్టా.. లేనట్టా..!
వైసీపీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖపై ఒక్కటే విమర్శలు గుప్పిస్తున్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. ఫస్ట్ టైం మినిస్టర్ సత్యకుమార్ యాదవ్.ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని.. వ్యవస్థను సర్వ నాశనం చేసారని ఒక్కటే విమర్శలు, లేనిపోని ఆరోపణలు వస్తున్నాయి. ఐతే మేం ఇంత చేశాం.. మీరేం చేస్తారో చెప్పండి.. లేదంటే ఇలా చేయండి అని చెప్పుకోవడానికి కూడా రజనీ ముందుకు రావట్లేదు. విమర్శలకు కనీస స్పందన లేదు. దీంతో విడదల అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.. వైసీపీలో ఉన్నారా.. లేరా..? అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్న పరిస్థితి. ఆ మధ్య మళ్ళీ సొంత గూడు టీడీపీలోకి వెళ్లిపోతారని.. లేదు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని .. ఈ రెండు పార్టీలు వద్దనే సరికి బీజేపీలో చేరడానికి కూడా సిద్ధం అయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. కనీసం ఈ వార్తలను కూడా ఖండించలేని పరిస్థితిలో రజనీ ఉన్నారు.
అబ్బే అదేం లేదు!
పార్టీ అధికారంలో లేకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన రజనీ తన వ్యాపారాలు చూస్తున్నారని.. త్వరలోనే మళ్ళీ జనాల్లో తిరుగుతారని అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. రాజకీయాల్లోకి రాక మునుపు అమెరికాలో సొంతంగా సాప్ట్ వేర్ కంపెనీలు నడిపిన రజనీ.. ఇప్పుడు మళ్ళీ వాటిపై దృష్టి పెట్టారని త్వరలోనే రిటర్న్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు. రోజా విషయంలో ఎన్ని వార్తలు.. ఎన్ని పుకార్లు వచ్చాయో చూసే ఉంటాం.. ఇప్పుడు రజనీ వంతు వచ్చింది. ఈమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి.. కనీసం సోషల్ మీడియాలో ఐనా అంతా తూచ్ అని ఎప్పుడు అంటారో.. లేదంటే గుడ్ బై అని వెళ్ళిపోతారో చూడాలి మరి.