బెజవాడను ముంచిందెవరు.. కాపాడిందెవరు..? ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ.. అంతకుమించి రచ్చ కూడా.! ఒకటి కాదు రెండు కాదు వారం రోజులకు పైగా వరదల థాటికి విజయవాడ విల విల్లాడుతూనే ఉంది..! ఎప్పుడు సాధారణ స్థితికి అర్థం కాని పరిస్థితి..! దీనంతటికీ కారణం బుడమేరు వరదే.. ఇది వైసీపీ నిర్లక్ష్యమేనని టీడీపీ చెబుతుంటే.. అంతా తూచ్ మాకేంటి సంబంధం మొత్తం మీరే చేశారని వైసీపీ దుమ్మెత్తి పోస్తోంది. అంతేకాదు.. మీ ఇంటిని, మీకు కావాల్సిన వారిని కాపాడుకునేందుకే ఇవాళ బెజవాడను ఇలా ముంచేశారని వైసీపీ ఆధారాలతో సహా బయటపెడుతుంటే.. ఇవాళ్టి ఈ పాపానికి.. పదిరోజులుగా విజయవాడ వాసులు పడుతున్న కష్టాలకు కర్త, కర్మ.. క్రియ మీరేనని టీడీపీ ఆరోపిస్తోంది.
అసలేందీ కథ..!
బెజవాడ మునగడానికి కారణం బుడమేరే. కానీ దీన్ని కంట్రోల్ చేయడంలో అదేనండోయ్.. వరద వస్తుందని ప్రజలకు తెలియజేయడంలో అధికారులు ఘోరంగా విఫలం అయ్యారని ఇదంతా మ్యాన్ మేడ్ అన్నది వైసీపీ నేతలు, స్వయంగా మీడియా ముందు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి. ఇందుకు సంబంధించి ఆధారాలను సైతం బయటపెట్టింది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ ఆర్పీ సిసోడియా, వెలగలేరు డీఈ మాధవ్ నాయక్ మాట్లాడిన మాటలకే ఇందుకు సాక్ష్యం అంటూ వైసీపీ ఆరోపించింది. ఈ ఇద్దరూ మాటల సారాంశం ఏమిటంటే.. వరద వస్తుందని ముందే తెలుసు.. అలర్ట్ చేశామని మాధవ్ అంటుంటే.. అలర్ట్ చేసినా సరే ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లరని పట్టించుకోరు.. సీరియస్‌గా తీసుకోరన్నది సిసోడియా చెప్పడం గమనార్హం. అంతేకానీ.. వీళ్లు ఎక్కడా ఇదిగో పరిస్థితి అని చెప్పిందీ కానీ.. చేసింది కానీ ఏమీలేదు.
లక్షలాది మందిని కాపాడాం..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. బుడమేరు పాపం సీఎం చంద్రబాబుది అయితే ఆ వరద థాటి లక్షలాది మందిని కాపాడింది మాత్రం మేమే.. (వైసీపీ) అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎలాగంటే.. రిటైనింగ్ వాల్ వల్ల కొన్ని వేల కుటుంబాలు ప్రాణాలతో గట్టెక్కాయని ఇందుకు వైసీపీ చేసిన మంచి పనులే కారణమని చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ మధ్య ఈ వాల్ గురించి.. వాల్ పే చర్చ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఎవరు కట్టారా అన్నది కాదని.. శంకుస్థాపన చేసింది, పనులు కూడా మొదటి ఫేజ్ నడిచింది టీడీపీ హయాంలోనే తెలుగు తమ్ముళ్లు చెబుతున్న పరిస్థితి. అయితే.. మిగిలిన రెండు ఫేజుల్లో పనులు పూర్తి చేసింది తామేనని.. అయినా వైఎస్ శంకుస్థాపన చేస్తే జగన్ పూర్తి చేశారని వైసీపీ నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు బల్ల గుద్ధి మరీ గర్వంగా చెబుతున్నారు.
ఇప్పుడు చెప్పండి..!
అంతేకాదు మొత్తం మేమే చేశాం అని చెప్పుకుంటున్న వైసీపీ.. పెద్ద పెద్ద లాజిక్ పాయింట్లే బయటికి తీస్తోంది. ఒక్క ఊరిలో 20-30% నీట మునిగితే సరిగ్గా పనిచేయలేనిది కూటమి ప్రభుత్వం అయితే.. అదే రాష్ట్ర మంతటా, కొవిడ్‌తో సతమతమైతే సమర్థవంతంగా పనిచేసింది వైసీపీ ప్రభుత్వం అని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు విజనరీ!, ఎవరు పబ్లిసిటీ మాస్టర్!, ఎవరి హయంలో అధికార్లు పనిచేసారు!, ఎవరు డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేశారు!.. అందరూ అంగీకరించాల్సిన నిజం కాదా..? అని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఒక్కటే హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ కాదు.. చంద్రబాబు అమరావతిలో కట్టిన భవనాలు భారీ వర్షంతో పనికి రాకుండా పోయాయి.. కానీ వైఎస్ జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది అని చెప్పుకుంటున్న పరిస్థితి.
ఎవరి గోల వారిదే..!
ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ మరో అడుగు ముందుకేసి ఇప్పుడు జగన్ తెచ్చినవన్నీ పనికొస్తున్నాయ్.. అని గుర్తు చేసి మరీ ఒక్కొక్కటీ బయటికి తీస్తున్నారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు.. జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ.. జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ.. జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్.. జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు.. జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు.. జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు.. జగనన్న తీసుకొచ్చిన వైఎస్సార్ హెల్త్ సెంటర్లు.. ఇవన్నీ విజయవాడను వరద కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కిస్తున్నాయని వైసీపీ శ్రేణులు, జగన్ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. అంతే కాదు.. వైఎస్ జగన్ కోటి రూపాయలు విరాళం.. పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ.. వరద బాధితులకు అండగా అనేకసార్లు పర్యటన.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళం ఇచ్చారు. ఇంతకు మించి ఏం కావాలి.. అధికార పార్టీ చేసినదేంటి..? అని వైసీపీ చెప్పుకుంటోంది.
సొమ్ము ఒకరిది..!
అవును.. అది మేమే.. ఇది మేమే అని చెప్పుకునే వైసీపీ.. ఇదంతా ఎవరి సొమ్ము..? ఎవరి కోసం తెచ్చినవి..? రేషన్ వాహనాలు మొదలుకొని అంబులెన్సుల వరకూ ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన పన్నులు కాదా..? ఇప్పుడు అవే ప్రజల కోసం వాడితే ఏమిటీ బరి తెగింపు మాటలు.. అవసరమా..? మరీ ఇంత నీచమా..? అసలు వరదలు ఎక్కడ.. వీళ్ళ మాటలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో చూడండి. ఇలా ఒకటా లెక్క లేనన్ని కౌంటర్లు వస్తున్నాయ్.. వైసీపీకి. ఐనా అడిగి మరీ ఇలా వాళ్లకు కావాల్సినవి ఇప్పించుకుంటారేమో.. ఎవరికి ఎరుక. ఇక వరదలు వచ్చాక నిద్రాహారాలు మాని, ఇల్లు వాకిలి వదిలి చంద్రబాబు బస్సు, కలెక్టరేట్ లో ఉంటూ.. నిత్యం వరద బాధితుల మధ్యనే ఉన్నారు. ఇక బుడమేరు గండ్లు పూడ్చే వరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.. ఇంకా అదే పనిలోనే ఉన్నారు కూడా. ఆయన నిద్రపోలేదు.. అధికారులు, మంత్రులు, విజయవాడ ఎమ్మెల్యేలు పనుల్లో నిమగ్నమయ్యారు. చూశారుగా ఎవరి గోల వారిదే.. ఐనా వర్షాలు, వరదలు అనేవి అంతే కాని మ్యాన్ మేడ్ అనుకుంటే అంతకు మించి అమాయకత్వం ఉండదేమో. ఇదీ వరదల గురుంచి.. ఇప్పుడు చెప్పండి.. ఎవరు ముంచారు.. ఎవరు కాపాడారు అనేది.. మీ ఛాయిస్.. మీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.