నాకూ రెడ్ బుక్ ఉంది.. 100 మంది తోలు తీస్తా!
అవును.. నాకూ ఒక రెడ్ బుక్ ఉంది కచ్చితంగా ఓపెన్ చేస్తా.. తోలు తీస్తా!.. నేను ఓపెన్‌గా ప్రెస్ ముందే చెబుతున్నా.. నావల్ల 100 మంది ఇబ్బంది పడబోతున్నారు. వందమంది లిస్ట్ ఉంది అని చెప్పుకొచ్చారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత రెడ్ బుక్ గురుంచి ఎంత రచ్చ రచ్చ జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో అస్సలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమలు కావట్లేదు అని వైసీపీ పెద్ద ఎత్తునే హడావుడి చేస్తోంది. రెడ్ బుక్‌లో పడి శాంతి భద్రతలు అటకెక్కించారు అని.. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువయ్యాయని ఆఖరికి ఈ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు.
ఎందుకు ఇలా..?
ఒకవైపు వరదలు.. ఇంకోవైపు జనాల ఆహాకారాలతో ఇబ్బంది పడుతున్న వేళ భూమా అఖిల ప్రియ మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చే చేశారు. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా పేర్లు ఉన్నాయి.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాగని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని అంతకుమించి కాదు..! ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని.. అలాంటి వరికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు. ఐతే తాను మాత్రం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టనని చెప్పానా? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అదే తరహాలో ఉంటానని అఖిల ఏదేదో మాట్లాడేశారు.
తప్పు చేస్తే కదా భయం!
ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతానని ముందే చెప్పా.. చెప్పినట్టుగానే చేసి తీరుతానన్నారు అఖిలప్రియ. రెడ్ బుక్ నుంచి ఇద్దరి, ముగ్గురు పేర్లు పాపమని తీసేశాను.. కానీ, వంద మందిని మాత్రం కచ్చితంగా ఇబ్బంది పెట్టబోతున్నానని మీడియా వేదికగా పదే పదే చెప్పడం గమనార్హం. తప్పు చేస్తేనే భయపడండి.. లేకపోతే హ్యాపీ ఉండండని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బహుశా ఈ జాబితాలో తొలిపేరు ఏవీ సుబ్బారెడ్డి ఉండొచ్చని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి కూడా ఉండొచ్చు..!
అతి అవసరమా!
అసలే అఖిల ప్రియ మీద లేనిపోని ఆరోపణలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలకు ఎంత మంచి పేరు ఉందనేది కాస్త రాజకీయాల గురుంచి తెలిసినోళ్ళకు చెప్పక్కర్లేదు. రాజకీయాలకి అతీతంగా మేం ప్రేమించిన మా శోభక్క కడుపున ఎట్లా పుట్టినావే తల్లీ..? అని సొంత పార్టీ కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. వైఎస్ జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఇలా అని ఉంటే.. రౌడీ రాజ్యం, రాజారెడ్డి రాజ్యం అని తెగ రచ్చ చేసేవారు కదా.. కుహనా మేధావులు ఇప్పుడు ఎక్కడికెళ్ళారు..? అని విమర్శకులు తిట్టేస్తున్నారు. రెడ్ బుక్ కాకపోతే వైట్ ఉండొచ్చుగాక ఇలా బహిరంగంగా ఇలా అతి చేయడం అవసరమా..? అని అందరూ అనుకుంటున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.