ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి విజయవాడ విల విలలాడింది. గత 50 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా వర్షాలు పడటంతో చిగురుటాకులా బెజవాడ వణికిపోయింది. నిద్రాహారాలు మాని అర్ధరాత్రి అని కూడా లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరద బాధితులను కాపాడటం కోసం పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తెప్పించారు సీబీఎన్. అక్కడక్కడా నిర్లక్ష్యం జరిగింది.. సాయం అందలేదని.. ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయ్.. ఇక్కడ అవన్నీ అప్రస్తుతం. అసలు విషయానికొస్తే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 లక్షల మంది ప్రజలను కృష్ణలంక రిటైనింగ్ వాల్ కాపాడింది. ఈ గోడ లేకుంటే పరిస్థితి అల్లకల్లోల్లమే అని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇంతకీ ఈ రిటర్నింగ్ వాల్ ప్రారంభించిందెవరు..? కట్టిందెవరు..? క్రెడిట్ కొట్టేయడానికి యత్నిస్తున్నదెవరు..? వైసీపీ, టీడీపీ మధ్య ఎందుకింతలా రిటైనింగ్ యుద్ధం నడుస్తోంది..?
ఇదీ అసలు సంగతి..!
రెండు మూడ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రిటైనింగ్ వాల్ లేకుంటే కలలో కూడా ఊహించలేని రీతిలో విధ్వంసం జరిగిపోయేది. అయితే.. ఇదంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అబ్బే అంతా చేసింది మేమే.. పూర్తి చేసింది మాత్రమే వైసీపీ అని టీడీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేస్తోంది. ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చ.. అంతకుమించి రచ్చ అవుతోంది. వాస్తవానికి రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు ఫేజ్-01 కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ప్రారంభించారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్ నిర్మాణం మూడు ఫేజ్‌లలో నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వంలో అడుగులు ముందుకు పడలేదు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగా.. కరకట్ట గోడను సగానికిపైగా పూర్తి చేశారన్నది తెలుగు తమ్ముళ్లు చెబుతున్న మాటలు. మొదటి ఫేజ్ 2.37 కి.మీ యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కి.మీ. గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు వేయడం జరిగింది. మొదటి దశ పనులు కూడా పూర్తి చేశామన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాటలు.
వైసీపీ చేసిందేంటి..?
టీడీపీ అంచనాల దగ్గరే ఆగిపోగా.. వైసీపీ అధికారంలోకి రాగానే ఫేజ్-01 పనులతో పాటు 02, 03 పనులు కూడా పూర్తి చేయడం జరిగిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది కాబట్టి క్రెడిట్ అంతా మాదేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. యువనేత దేవినేని అవినాష్ డిమాండ్‌తోనే ఈ రక్షణ వలయం షురూ అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏమీ చేయలేదన్నది వైసీపీ చెబుతున్న మాటలు. 2021లో గద్దె రామ్మోహన్ భారీ ఆందోళన చేయడంతో దిగొచ్చిన వైసీపీ హడావుడిగా పనులు అది కూడా రూ.50 కోట్లు పెంచి నిర్మాణ పనులు చేపట్టిందని టీడీపీ తిట్టిపోస్తోంది. అలా రెండు, మూడు దశల పనులు అయ్యాయి. నాడు నాన్న వైఎస్ ప్రారంభిస్తే.. నేడు 2024లో కొడుకు వైఎస్ జగన్ పూర్తి చేశారన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. విజయవాడలో ఎన్నో వేల కుటుంబాల ప్రాణాలను, ఆస్తులను కాపాడింది ఈ రిటైనింగ్ వాల్ అని.. విజయవాడ చరిత్రలో ఈ ప్రాజెక్టుకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని వైసీపీ చెబుతోంది. దీన్ని బట్టి మీరు క్రెడిట్ ఎవరికిస్తారో.. మీ ఇష్టం మరి..!