ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి పార్టీల నేతలు ఏదో ఒక రచ్చతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయండి.. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని పదే పదే సీఎం నారా చంద్రబాబు వార్నింగ్‌లు, సూచనలు చేస్తున్నప్పటికీ అస్సలు లెక్కచేయడమే లేదు. ఇటీవలే కేబినెట్ భేటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిపడేశారు. అయినా సరే.. కొందరి తీరు మారట్లేదు. ప్రభుత్వంలోని టీడీపీ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి.
ఊరికే ఉండరే..?
పరిటాల శ్రీరామ్.. ఈ పేరు, పరిటాల ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. ధర్మవరం నుంచి పోటీచేయాలని ఎంతో తహతహలాడిన యువనేతకు నిరాశే మిగిలింది. ఎందుకంటే.. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి వెళ్లింది. వైసీపీ తరఫున పోటీచేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కమలం పార్టీ నుంచి బరిలోకి దిగిన సత్యకుమార్ ఢీ కొన్నారు. కేవలం 3,734 ఓట్లతో గట్టెక్కిన సత్య.. కేబినెట్‌లో చోటు దక్కించుకుని వైద్య శాఖ మంత్రి అయ్యారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. సీటు విషయంలో రగిలిన కోల్డ్ వార్ పరిటాల- సత్య మధ్య నడుస్తూనే ఉంది. ఇది కాస్త బహిరంగంగా తిట్టుకుని.. కాలర్ పట్టుకుని ఈడ్చేస్తాననే మాటల దాకా వెళ్లింది.
ఇదీ అసలు సంగతి..
మంత్రి సత్యకుమార్ అండతో ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లికార్జున బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది శ్రీరామ్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆయన.. మల్లికార్జున ఆఫీసుకొస్తే కాలర్ పట్టుకుని ఈడ్చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా నాలుగు గోడల మధ్య అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదేమో కానీ.. నలుగురిలో కావడంతో ఇప్పుడు ఇటు మీడియాలో.. అటు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ హెచ్చరికల తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికలప్పటి నుంచి ధర్మవరంలో నెలకొన్న ఈ రచ్చ ఇప్పుడు మళ్లీ షురూ అయ్యిందంటూ ఇరు పార్టీల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ ఆధిపత్య పోరులో పడి ధర్మవరం అభివృద్ధిని కూటమి నేతలు గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోల్డ్ వార్‌ను అధిష్టానం కూల్‌గా సెట్ చేస్తే సరే.. లేకుంటే పరిస్థితులు మరింత ముదిరే ఛాన్స్ ఉందని నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి..!