వైఎస్ జగన్ కోసం రంగంలోకి పీకే..?
వైసీపీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) రంగంలోకి దిగుతున్నారా..? అటు తిరిగి.. ఇటు తిరిగి మళ్లీ పీకే దగ్గరికే అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారా..? ఆఖరికి ఆయనే దిక్కయ్యారా..? అంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. గత రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ.. రచ్చ ఇదే..! ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత..? వైసీపీ కోసం పనిచేసేంత తీరికగా ఆయన ఉన్నారా..? ఎవరి ద్వారా జగన్ మళ్లీ అప్రోచ్ అయ్యారనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
అవునా.. నిజమా..?
2019 ఎన్నికల్లో వైసీపీని ఊహించని రీతిలో 151 స్థానాల్లో గెలిపించడంలో పీకే ప్రధానమైనది. దీంతో పాటు వైఎస్ జగన్ క్రేజ్, ఒకే ఒక్క ఛాన్స్, టీడీపీపై ఉన్న వ్యతిరేకత, జనసేన ఒంటరిగా పోరుకు దిగడం ఇవన్నీ కూడా గెలుపునకు కారణమే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. పీకే-జగన్ ఇద్దరూ విడిపోయారు. ప్రశాంత్ లేనప్పటికీ ఐప్యాక్ టీమ్‌తో కంటిన్యూ అవుతూ వచ్చింది వైసీపీ. సీన్ కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ ఓ అని తెగి చించుకుని చివరికి క్రికెట్ టీమ్ (11 స్థానాలు) కే పరిమితం అయ్యింది. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లుగా వైసీపీ ఓటమికి లెక్కలేనన్ని ఉన్నాయన్నది సొంత పార్టీ నేతలు, క్యాడర్, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు గతం గత: .. కావాల్సిందల్లా 2029 ఎన్నికల్లో పార్టీ గెలవడమే. ఇందుకు దారులు ఎటు చూసినా మూసుకుపోయాయ్.. పైగా కేంద్రంలోని బీజేపీ, జనసేన కూడా టీడీపీకి తోడవ్వడం.. రేపొద్దున్న కూడా ఇదే కూటమి ఎన్నికలకు వెళ్తే జగన్‌కు వచ్చే ఆ టీమ్ కూడా పోయి ఏమైనా జరగొచ్చన్నది నడుస్తున్న టాక్.
ఆ కిక్కే వేరబ్బా..!
2019 కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే మాత్రం ఆ కిక్కే వేరుగా ఉంటుందని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి రానున్న 2029 ఎన్నికలు ఇటు వైసీపీకి.. అటు టీడీపీకి డూ ఆర్ డై లాంటివే. వైఎస్ జగన్ గెలిస్తే.. టీడీపీ రూపురేఖలుండవ్..! ఒకవేళ టీడీపీ గెలిస్తే మాత్రం వైసీపీ చాపచుట్టేయాల్సిందే..! ఈ పరిస్థితుల్లో ఇప్పట్నుంచి సర్వం సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళ్తే తప్ప గెలుపు అనేది అంత ఆషామాషీ కాదు. ఈ క్రమంలోనే జరిగిందేదో జరిగిపోయింది.. నువ్వు లేని ఐప్యాక్ ఊహించలేం.. నీ సేవలు కావాలి.. అని స్వయంగా పీకేకు జగన్ కాల్ చేశారన్నది తాజాగా నడుస్తున్న టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే బెంగళూరు ప్యాలెస్ వేదికగా మీటింగ్ ఉంటుందట.
అవసరమా..?
వాస్తవానికి ఒకప్పుడు పీకే వేరు.. ఇప్పుడు పీకే వేరు. ఎందుకంటే.. ఆయన సక్సెస్ రేటు ఎంతుందే అంతకుమించి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. అయినా.. 2029 ఎన్నికలకు వైసీపీకి ఎలాంటి స్ట్రాటజిస్ట్ అక్కర్లేదని ఒక్క సూపర్ సూక్స్ చాలని అవే గెలిపిస్తాయని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా ఇప్పటికీ ఒక్కటీ అమలు చేయకపోవడం.. రేపొద్దున్న కూడా పరిస్థితి ఇంతకుమించే ఉంటుంది కానీ.. అయ్యే పనులు ఏవీ లేవని.. అప్పుడే జగన్ వాల్యూ ఏంటన్నది జనాలకు ఇప్పటికే తెలిసిందని చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. పీకే కొత్తగా జన్ సురాజ్ అని పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనది ఆయన చూసుకునేందుకే టైమ్ లేదు.. ఇక వైసీపీని కూడా చూస్తారా..? అబ్బే అంత సీన్ లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు మరి.