దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అదేనండోయ్ పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పుడు కావాల్సినవి.. చేయాల్సినవి చేసేసుకోవాలి అని అర్థం..! ఇది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లో బాగా వంటబడుతుంది..! ఎందుకంటే ఫామ్‌లో ఉన్నప్పుడు నాలుగు రూపాయిలు వెనకోసుకోవడం ఇండస్ట్రీలో మామూలే! అలాగే రాజకీయాల్లోనూ అధికారంలో ఉండగా తిన్నగా పనులు కానిచ్చేస్తుంటారు నేతలు..! అందుకే తెలంగాణలో సచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీని ఐసీయూలోకి తీసుకెళ్లి.. చికిత్స చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అందుకే నెలలో రెండు, మూడు సార్లు హైదరాబాద్‌కు రావడం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ఉన్న కాస్తో కూస్తో క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు విశ్వప్రయత్నాలే చేస్తున్నారు సీబీఎన్. ఆయన సరే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంగతేంటి..? తెలంగాణలో పార్టీ అక్కర్లేదా..? పూర్తిగా వదిలేస్తున్నారా..? అనేది అభిమానులు, కార్యకర్తలు.. ఇక్కడి నేతలకు తెలియట్లేదు.
వద్దనుకున్నారా..?
ఏపీలో జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది.. 100 శాతం స్ట్రైక్ రేటుతో యమా జోష్ ఉంది. కానీ.. రేపొద్దున్న ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి..? అనేది క్వశ్చన్ మార్క్‌గానే ఉండిపోతోంది..! పోనీ గోదావరి రాష్ట్రాలతో పాటు రాయలసీమలో కాస్త పట్టు ఉండే జిల్లాల్లో ఇంకాస్త బలోపేతం చేసుకోవాల్సి ఉంది.. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలుపెట్టినట్లే..! కాసేపు ఏపీని పక్కనపెడితే.. పార్టీ పుట్టింది.. పెరిగింది తెలంగాణలోనే. ఇక్కడ పార్టీ ఉండాలా వద్దా..? ఉన్న క్యాడర్ ఏమవ్వాలి..? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ ఇక్కడ ఉండాలంటే ఏదో ఒకటి చేసి బలోపేతం చేసుకోవాలి.. లేదా పూర్తిగా పక్కనెట్టేసేయాలి. ఇవన్నీ కాదు ఏపీలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా కూటమి కంటిన్యూ కావాలి అనుకుంటే ఓ ప్రకటన చేసేస్తే పోతుంది..!
సైకిల్ రెఢీ..!
తెలంగాణలో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇవే ఏ పార్టీకి అయినా సత్తా చూపించుకోవడానికి సరైన టైమ్. అందుకే.. సైకిల్ జోరు మీద ఉంటే.. కారు (బీఆర్ఎస్) అంతకుమించి క్రీజులో ఉంది. ఇక బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు అయితే నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి కాస్త ప్రయోజనం ఉంటుందంటారు కదా.. ఈ టైమ్‌లోనే జనసేన గాజు గ్లాస్ గట్టిదనం ఎంతో చూసుకుంటే బాగుంటుంది మరి. సీబీఎన్ జోరులో పవన్ భాగమవుతారా.. లేకుంటే సపరేటుగా అయినా పార్టీని ట్రాక్ ఎక్కిస్తారా..? ఏదో ఒకటి తేల్చుకుని ఉన్న క్యాడర్‌ను కాపాడుకుంటే మంచిది మరి.