Advertisement

ఆంధ్రాకు హైడ్రా కావాల్సిందే..?


హైడ్రా.. ఇప్పుడీ పేరు మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా వినిపిస్తోంది..! ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు గానీ.. చెరువులు, నదులు ఇలా ఏదైనా ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు చేస్తే చాలు ఏవీ రంగనాథ్ అండ్ టీమ్ వాలిపోతుంది..! ఇప్పటికే వందల ఎకరాల్లో ఆక్రమణలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉన్న కట్టడాలను కుప్పకూల్చేసింది..! తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను నేలమట్టం చేయడంతో అటు సినీ రంగంలో.. ఇటు రాజకీయ, రియల్ స్టేట్ రంగంలోని ప్రముఖులు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకునే వాళ్లూ ఉన్నారు.. ఇది అందరికీ వర్తించకపోతే బాగోదని తిట్టిపోసే వాళ్లూ ఉన్నారు. ఎప్పుడేం జరుగునో బుల్డోజర్ ఎప్పుడు ఇంటి ముందు వచ్చి వాలుతుందో అని భయపడిపోతున్నారు..! ఇదీ హైదరాబాద్‌లో పరిస్థితి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ ప్రజలు, టీడీపీ నుంచి ఎక్కువగా వినిపిస్తోంది..!

Advertisement

ఎందుకనీ..?

వైసీపీ పాలించిన ఐదేళ్లలో ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎవరు చూసినా అవినీతికి పడగలెత్తారనే ఆరోపణలు కోకొల్లలు. తాడేపల్లి ప్యాలెస్ మొదలుకుని రుషికొండ వరకూ వైసీపీ నేతలు ఎక్కడా ప్రభుత్వ భూమిని వదలకుండా ఆక్రమించడం.. అక్రమ నిర్మాణాలు కట్టేయడం చేశారని మీడియా ముఖంగా టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆధారాలతో సహా చూపించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య విజయసాయిరెడ్డి, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఇలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకూ ఆక్రమణలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాంటప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ కచ్చితంగా కావాల్సిందే కదా..! అనేది పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్. అందుకే.. మన ఆంధ్రాకు హైడ్రా కావాల్సిందే.. ఏవీ రంగనాథ్ లాంటి తోపు, తురుం కావాల్సిందేనని ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు మొదలుకుని రాజకీయ నేతల వరకూ డిమాండ్ వస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇదే పెద్ద చర్చ నడుస్తోంది.

నాడు.. నేడు..!

వాస్తవానికి.. ఇలాంటి వ్యవస్థను వైసీపీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ షురూ చేశారు. ప్రజావేదికతో కూల్చివేతలు మొదలుపెట్టగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆదిలోనే దీనికి అంతం పలకాలని అనుకున్నారో ఏంటో కానీ.. మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ఎక్కడా కూల్చుడు అనే మాట రాలేదు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కూల్చివేతతో మొదలవ్వగా.. ఈ క్రమంలోనే ఎన్నో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కోర్టులకు వెళ్లడం, స్టేలు తెచ్చుకోవడంతో ఫుల్ స్టాప్ పడింది. అందుకే.. పార్టీ పక్కనెట్టి వైసీపీనా, టీడీపీనా, జనసేననా, బీజేపీనా.. బలిసినోడా.. బక్కోడా అనేది లెక్కచేయకుండా అందరిపైనా కొరడా ఝులింపించాల్సిందేనని డిమాండ్ అయితే వస్తోంది. దీనికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఏమవుతుందో ఏమో..!

చెరువులు, కొండలు, బీచ్‌లు, నదీ పరివాహాక ప్రాంతాల్లో నిర్మాణాలు ఏపీలో గట్టిగానే ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యమే. పక్క రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయకూడదు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే..! ఇక రియాల్టీలోకి వస్తే.. నదిని ఆక్రమించి కరకట్ట చుట్టూ అక్రమంగా నిర్మించిన ఇళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక్కడ్నుంచే మొదలు పెడితే బాగుంటుంది అనేది వైసీపీ నుంచి వస్తున్న డిమాండ్. అది ఎవరి నిర్మాణం అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయాల్సిందే. ఆ లెక్కన సీఎం నారా చంద్రబాబు ఇల్లు కూడా ఈ జాబితాలో ఉంటుందని.. ఇది అయ్యే పనేనా..? అనే అనుమానాలు సైతం ఓ వైపు వస్తున్నాయి. మరోవైపు.. అసలు హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి ఎందుకు అవసరం..? ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే అక్కడ మాత్రమే అణచివేస్తే పోతుంది కదా..? అనేవాళ్లు లేకపోలేదు. ఒక వేళ తప్పనిసరి కావాల్సిందే.. రావాల్సిందే అంటే శిష్యుడు రేవంత్ రెడ్డి అక్కడ చేసినట్లుగా.. ఇక్కడ గురువు గారు సీబీఎన్ ఫాలో అవ్వాల్సిందేనేమో.. అప్పుడిక ఏం జరుగునో.. ఏమవుతుందో.. ఎంతవరకూ వెళ్తుందో చూడాలి మరి.

 

 

 

Andhra needs Hydra..?:

Chandrababu should follow Revanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement