అవును.. యువనేత నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఇందుకు పోటీగా గుడ్ బుక్ అందుబాటులోకి వస్తోందని ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది రాసేది మరెవరో కాదండోయ్ వైసీపీ..! స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఈ గుడ్ బుక్కులో ఏమేమి ఉండబోతున్నాయ్..? దీనివల్ల సభ్య సమాజానికి ఏమిటి ప్రయోజనం..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
అప్పుడు.. ఇప్పుడు..!
యువగళం పాదయాత్ర, వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు.. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వారిని వదిలిపెట్టే ప్రశ్నే ఉండదని ప్రజలకు ఒకటికి పదిసార్లు చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది..! అధికారంలోకి వచ్చాక అనుకున్నట్టుగానే బుక్ ఓపెన్ చేసి.. వేట మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటికి రాగా.. త్వరలోనే బిగ్ బుల్స్ బయటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఏపీలో నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఐతే.. ఇప్పుడు రెడ్ కాదు పోటీగా గుడ్ తెస్తోంది వైసీపీ. నాడు అంతా రెడ్ బుక్.. నేడు గుడ్ బుక్ వస్తోందన్న మాట.
ఏం ఉంటదో..?
రెడ్ బుక్ ఓపెన్ చేయడంతో.. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ నిశితంగా గమనిస్తున్న వైసీపీ గుడ్ బుక్ ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్య నేతలతో జరిగిన భేటీలో చర్చించారట. టీడీపీ హయాంలో ఇబ్బంది పెడుతున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు.. ఎంపీ, ఎమ్మెల్యేలు.. మంత్రులు వరకూ చేసే అరాచకాలు, అవినీతి అన్నీ ఇందులో రాస్తారని తెలిసింది. ఈ ఋక్కులను నియోజకవర్గ స్థాయిలోనే రాస్తారని.. ఇవన్నీ ఎప్పటికప్పుడు లేదా నెలకోసారి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో నిజానిజాలేంటి అనే విషయం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.