మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాకు దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. ఈ సినిమాను 13 నిమిషాలు కత్తిరించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిని కూడా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలకు ముందు వేసిన పెయిడ్ ప్రీమియర్స్‌కే టాక్ వీక్ అయిపోయింది. దీంతో రిలీజ్ రోజైన ఆగస్ట్ 15న చాలా చోట్ల ఈ సినిమాకు సరైన కలెక్షన్స్ లేవు. నెగిటివ్ టాక్ ప్రేక్షకులలోకి బాగా వెళ్లిపోయింది.
అయినా సరే.. రవితేజ ఎనర్జీ, న్యూ హీరోయిన్ గ్లామర్ ఈ సినిమాను కాస్త పడిపోకుండా లేపే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ప్రేక్షకులకు మరింత క్రిస్పీగా సినిమా ఉండేలా మేకర్స్.. 13 నిమిషాల అవసరం లేని సీన్లను కట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం.. కాస్త ప్రేక్షకులకు ఊరటనిచ్చే విషయమే. నిర్మాణాత్మక విమర్శలు, వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని.. ప్రేక్షకులకు మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే క్రమంలో 13 నిమిషాలు ట్రిమ్ చేయడం జరిగిందని మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం టాక్ వీక్‌గా ఉన్నా.. సినిమా నిదానంగా పుంజుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ పోటీ నడుమ వచ్చిన ఈ సినిమా ఏ మేరకు పుంజుకుంటుందీ.. అనేది వేచి చూడాల్సి ఉంది.