విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజ చిత్రం విడుదలైన అన్ని భాషలలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇందులో విజయ్ సేతుపతి నటనకు జనాలు నీరాజనాలు పట్టారు. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా.. ఆ సంస్థకు మంచి లాభాలను గడించి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వైవిధ్యభరిత చిత్రానికి ఈ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై విజయ్ సేతుపతిని మహారాజగా చూపించిన నితిలన్ స్వామినాథన్.. ఇప్పుడిదే బ్యానర్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ని మహారాణిగా చూపించబోతున్నారట. ఆ మహారాణి ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార అని తెలుస్తోంది. ఈ మహారాణికి సంబంధించి నితిలన్ వినిపించిన కథ అద్భుతంగా ఉండటంతో వెంటనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మాత సుధన్ సుహాన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.
మహారాజ సినిమా తర్వాత దర్శకుడు నితిలన్ స్వామినాథన్‌ను రజినీకాంత్, విజయ్ వంటి వారు స్వయంగా ఇంటికి ఆహ్వానించుకుని అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చేయనున్న మహారాణితోనూ ఆయన మరో మెట్టు ఎక్కడం కాయం అనేలా అప్పుడే కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది.