గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో గౌరవ అథిగా ఆహ్వానం అందుకుని అరుదైన గౌరవాన్ని పొందిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానం నిమిత్తం ఇప్పటికే తన ఫ్యామిలీతో కలిసి మెల్‌బోర్న్ చేరుకున్న రామ్ చరణ్‌కు ఘనమైన ఆహ్వానం లభించింది. ఫ్యాన్స్, ప్రభుత్వ అధికారులు రామ్ చరణ్‌ను రిసీవ్ చేసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పది రోజుల పాటు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవడమే కాకుండా.. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారాన్ని అందుకోనున్నారు. అంతేకాకుండా.. మెల్‌బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్‌లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఇండియన్ ఫ్లాగ్‌ని ఆవిష్కరించనున్నారు. నిజంగా ఇది చరణ్‌కు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ అప్డేట్స్‌తో మెగా ఫ్యాన్స్ మాములుగా సందడి చేయడం లేదు. ఇది మా వాడి రేంజ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంచలన దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.