కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చిపోయి టీడీపీ ని, జనసేనను కావాలని ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలు ఒక్కొకళ్ళకి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతుంది. గతంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై రాళ్ళు విసురుతూ వైసీపీ కార్యకర్తలు, గుండాల మాదిరి వ్యవహరించిన వల్లభనేని వంశీ ని ప్రస్తుతం అరెస్ట్ చెయ్యాలని పోలీసులు కాచుకుని కూర్చున్నారు.
గత పది రోజులుగా వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో హై డ్రామా నడుస్తుంది. టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ అనుచరులు ఇప్పటికే అరెస్ట్ కాగా.. వారు వంశీ చెబితేనే చేశామని పోలీసులు ముందు ఒప్పుకోగా.. ఈ కేసులో A 71 నిందితుడిగా ఉన్న వంశీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులకు వంశీ షాకిచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్ట్ చెయ్యకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ పిటిషన్ వేసాడు. నేడు ఇరు వర్గాల వాదనలు విన్న హై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
అంతేకాకుండా ఈనెల 20వ తేదీ వరకు వంశీ అరెస్ట్ విషయంలో ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దానితో వల్లభనేని వంశీ కి కాస్త ఊరట లభించినట్లయ్యింది.