ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ పుట్టుక.. గెలుపు ఓటములను ఎన్నో చూసిన ఈ గడ్డను వదలకూడదని ఏదో ఒకటి చేసి బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్నది అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్లాన్. అందుకే వారంలో ఒకట్రెండు రోజులు అయినా సరే తెలంగాణ కోసం కేటాయిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రెండు సార్లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చి పార్టీ బలోపేతంతో పాటు పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి..? ఎవరైతే సెట్ అవుతారు..? అని లోతుగా చర్చలు జరిపారు. ఆఖరికి మొన్న కోడలు నారా బ్రాహ్మణి లేదా నారా లోకేష్‌కు పగ్గాలు ఇచ్చేయాల్సిందేనని క్యాడర్ పట్టుబట్టింది. సీబీఎన్ మనసులో ఏముందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా తెరపైకి నందమూరి ఆడపడుచు సుహాసిని పేరు వచ్చింది.
ఇక్కడ్నుంచే మొదలు..!
టీడీపీ సామాన్య కార్యకర్తను సైతం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. ముఖ్యమంత్రి.. పార్టీ అధ్యక్షుడు ఇలా చేసుకుంటూ వచ్చింది. ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి. ఆయన జీవితం సాధారణ కార్యకర్తగా మొదలై ముఖ్యమంత్రి వరకూ చేరింది. ఎల్. రమణ కూడా అంతే అధ్యక్షుడు అయ్యారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను సైతం అధ్యక్షుడిని చేయగా.. పార్టీని సర్వనాశనం చేసి ఇద్దరూ వెళ్లి బీఆర్ఎస్‌లో చేరిపోయారనే అపవాదు ఉండనే ఉంది. ఇక అవన్నీ అటుంచితే.. ఇప్పుడు పార్టీ బలపడాలి.. రానున్న పంచాయతీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది హైకమాండ్. ఇందుకు చేయాల్సిన వ్యూహ రచన అంతా బ్యాకెండ్‌లో చంద్రబాబు చేస్తూనే ఉన్నారట. ఈ ఎన్నికల్లోపే పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలన్నది తేల్చడానికి సన్నాహాలు చేస్తున్నారట సీబీఎన్.
ఫైనల్‌గా ఎవరికో..!
ఎప్పుడైతే నారా బ్రాహ్మణి పేరు తెరపైకి వచ్చిందో.. సుహాసినీ కూడా తాను కూడా టీడీపీ కోసం పనిచేయాలని కాంక్షను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్‌లతో పంచుకున్నారట. దీనిపై ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. సుహాసినికి పగ్గాలు ఇస్తే.. బ్రాహ్మణిని పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. లేని పక్షంలో ఒకరికి అధ్యక్ష పదవి.. మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇదే సందేశం క్యాడర్‌కు వెళ్లగా ఓకే అని కూడా చెప్పేశారట. ఇదే నిజమైతే గనుక.. నారా, నందమూరి కుటుంబాల ఆడపడుచులే పార్టీని ముందుకు నడిపించబోతున్నారన్న మాట. మరోవైపు.. గోనె ప్రకాశరావు, పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నర్సింహులు, సామ భూపాల్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్సల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి.. ఇంతమంది ఊహావహులు, ఆశావహులు ఉన్నారు.. ఫైనల్‌గా చంద్రబాబు మనసులో ఏముందో.. ఎవరు అధ్యక్షుడు అవుతారో.. లేదా అధ్యక్షురాలు అవుతారో వేచి చూడాలి మరి.