Advertisement
Google Ads BL

బొత్సను వైవీ సుబ్బారెడ్డి ఓడిస్తున్నారా..!?


బొత్స గెలుపు కష్టమేనా..!?

Advertisement
CJ Advs

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు కష్టమేనా..? సొంత పార్టీ నేతలే ఆయన్ను ఓడించడానికి కుట్ర పన్నుతున్నారా..? ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్న బొత్సను నిలబెట్టి గెలిపించుకుని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సొంత పార్టీ నేతలే లెక్క చేయట్లేదా..? సత్యనారాయణ పోటీ చేయడమే చాలా మందికి ఇష్టం లేదా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అక్షరాలా నిజమనే అనిపిస్తోంది.. ఈ అనుమానాలు సామాన్య ప్రజలకో.. ప్రత్యర్థులకో కాదండోయ్ సొంత క్యాడర్‌కే..! వైసీపీలో ఏం జరుగుతోంది..? అధినేత తలస్తున్నది ఏంటి..? నేతలు ఆచరిస్తున్నదేమిటి..? బొత్స ఏమంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నిక. గెలిచి పరువు నిలబెట్టుకుని.. ఇదీ మా సత్తా అని అనిపించుకోవడానికి వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ గెలుపునకు కేరాఫ్ అడ్రస్ కూటమియేనని నిరూపించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పెద్ద సాహసమే చేస్తున్నాయి. ఎందుకంటే బలం లేకున్నప్పటికీ పోటీకి దిగడమంటే మామూలు విషయం ఏమీ కాదు. ఇక అవన్నీ కాసేపు అటుంచితే.. సోమవారం నాడు బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి బొత్స సతీమణి ఝాన్సీ, అరుకు ఎంపీ తనుజా రాణి, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, గొలగాని హరివెంకట కుమారిలు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా మంది సీనియర్లు, మాజీలు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరూ హాజరుకాలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జీ, వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి డుమ్మా కొట్టడం పెద్ద ట్విస్ట్. విశాఖలోనే ఉన్నప్పటికీ హాజరుకాకపోవడం.. పైగా కలెక్టర్ కార్యాలయం గేటు వరకూ వచ్చినట్లే వచ్చి తిన్నగా జారుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఏదో గట్టిగానే తేడా కొడుతున్నట్లే ఉందని క్యాడర్‌కు ఎక్కడలేని సందేహాలు వచ్చేస్తున్నాయ్.

ఎందుకిలా..?

ఉత్తరాంధ్రకు పరిచయస్తుడిగా, కాంగ్రెస్ హయాం నుంచి నేటి వరకూ వివాద రహితుడిగా పేరున్న వ్యక్తి. దీనికి తోడు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా సరైనోడు అని బొత్సను ఏరికోరి మరీ జగన్ అభ్యర్థిగా బరిలోకి దింపాడు. అధినేత ఇలా అనుకున్నారు కానీ.. జిల్లాలో మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ మొత్తమ్మీద ఎమ్మెల్సీగా పోటీచేసే నేతే లేరా..? విజయనగరం నుంచి తీసుకొచ్చి పోటీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది..? అని లోకల్, నాన్ లోకల్ అనే గొడవలు తెరపైకి వచ్చేశాయ్. నాడు మొదలైన ఈ గొడవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనే చర్చ గట్టిగానే సాగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హాజరుకాలేదనే టాక్ నడుస్తోంది. అంటే.. బొత్స పోటీ చేయడం విశాఖ నేతలకు అస్సలు ఇష్టం లేదనే విషయం ఇలా బహిర్గతం చేశారన్న మాట.

చేజేతులారా..!

ఈ ఉప ఎన్నిక జరుగుతోందే.. వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామాతో గనుక పార్టీకి గట్టిగానే బలం ఉంది. మొత్తం 838 ఓట్లు ఉండగా.. వైసీపీకి 530 పైగానే ఓట్లున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామన్నది జగన్ ధీమా. అయితే పార్టీలో పరిస్థితులు, వైవీ సుబ్బారెడ్డి తీరుతో క్యాడర్ కంగుతింటోంది. కొంపదీసి వైవీ-బొత్స మధ్య ఏమైనా గొడవలున్నాయా..? ఇద్దరికీ పడట్లేదా..? వైవీ ఎందుకిలా చేస్తున్నారు..? ఇవన్నీ ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నాయ్. ఈజీగా గెలిచే ఎన్నికను పరిస్థితులు ఇలాగే ఉంటే చేజేతులారా బొత్సను వైసీపీనే ఓడించుకుంటోందనే మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయ్. దీనికి తోడు బొత్సకు ప్రత్యర్థిగా బడా బిజినెస్‌మెన్‌ను కూటమి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్. ఇదే జరిగితే డబ్బుల పరంగా ఇబ్బందేమీ ఉండదు.. కూటమి గట్టిగానే ఖర్చుపెట్టి మరీ ఓట్లు కొనేసి గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. చూశారుగా.. ఐకమత్యం అనేది లేకుండా అధినేత అలా.. బొత్స ఇలా.. ముఖ్య నేతలు, జిల్లా నేతలు మాత్రం ఇంకోలా ఉంటే గెలుపు ఎక్కడ్నుంచి వస్తుందో చెప్పండి..! పరువు విషయం గనుక జగన్ స్వయంగా రంగంలోకి దిగితే కానీ.. గెలుపు సాధ్యం కాదనే విషయం క్యాడర్ పదే పదే గుర్తు చేస్తోంది.. ఫైనల్‌గా ఏం చేస్తారో.. ఏంటో చూడాలి మరి.

YV Subba Reddy is defeating Botsa..!?:

YV Subba Reddy and Botsa Satyanarayana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs