పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ బాధ ఏంటో..? ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు..? పోనీ సమయం, సందర్భాన్ని ఏమైనా ఉంటుందా..? అంటే అదీ ఏమీ ఉండదు..! మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. అందుకే.. వర్మ బాధని కాస్త పట్టించుకోని, అర్థం చేసుకొని.. సమస్యకు పరిష్కారం చూపాలని పదే పదే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారు అభిమానులు, కార్యకర్తలు..!
ఏం నడుస్తోంది వర్మ!
పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు, తన ఆస్థానం అంతకుమించి కంచుకోట అయిన పిఠాపురం నియోజకవర్గంను వదులుకున్న వ్యక్తి వర్మ. ఐనా సరే టికెట్ విషయంలో వర్మ అనుచరులు, అభిమానులు చేసిన యుద్ధం అంత ఆషామాషీ ఐతే కాదు. దీంతో చేసేదేమీ లేక హైకండ్ బుజ్జగింపులు చేసింది. అధికారంలోకి వచ్చాక ఇదిగో పిఠాపురంను మరో హైదరాబాద్ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. గుండెళ్ళో పెట్టుకుంటాను.. తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కూడా మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఇదిగో మీరు మాట ఇచ్చిన విషయం గుర్తు చేయబోయి ఏదేదో మాట్లాడుతున్నారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఏం కావాలి..?
వాస్తవానికి పిఠాపురంలో కూటమి తరపున వ్యవహారాలన్నీ పవన్ సోదరుడు నాగబాబు చూసుకుంటున్నారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే ఆయనకు గట్టిగానే మండిపోయిందని కనీసం నేను ఇచ్చిన, త్యాగం చేసిన నియోజక వర్గానికి ఇంచార్జిగా కూడా పనికిరానా..? అనే బాధ గట్టిగానే ఉన్నట్లు వర్మ మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. అసలే కూటమి సర్కార్ తనను పట్టించుకోలేదని.. పదవి ఇవ్వలేదనే కోపంతో ఉన్న ఆయనకు.. ఈ చేరికతో పుండు మీద కారం చల్లినట్టుగా అయ్యింది. తనకు ప్రత్యర్థి అయిన దొరబాబును పార్టీలో ఎలా చేర్చుకుంటారు..? అన్నది వర్మ ప్రశ్నిస్తున్నారు.
నేను లోకల్..!
చూశారుగా వర్మ బాధ.. కోపానికి కారణాలు ఏంటి అనేది..! చంద్రబాబుకు ఉన్న అభిమానులు, కోట్లాది కార్యకర్తల్లో ఒక్కడిగా సైనికుడిగా నేనూ ఉన్నాను. నేను స్టానికుడిని.. పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని.. లోకల్ అంటూ తెగ చెప్పుకుంటున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని.. నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే అయ్యే పని కానే కాదు.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే, ప్రజల కష్టాల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు..? అసలు సందర్భం ఏంటి అనేది తెలియట్లేదు.. ఒకవేళ పవన్ గురుంచి మాట్లాడారా..? లేదంటే ఎర్ర కండువా కప్పుకోవడానికి సిద్ధమైన దొరబాబు గురించో అనేది తెలియదు కానీ గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. సో.. వర్మ బాధ ఏంటి..? ఏం కావాలి..? ఆయన ఏం ఆశిస్తున్నారు..? కొంచం తెలుసుకొని డిప్యూటీ సీఎం పరిష్కరిస్తే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..!