దువ్వాడకు బాగానే తెలిసొచ్చిందే..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఉంచుకున్న దివ్వెల మాధురీ కోసం.. కట్టుకున్న భార్య వాణిని, ఇద్దరు కుమార్తెలను వదులుకుంటున్న పరిస్థితి. త్వరలోనే సతీమణికి విడాకులు ఇచ్చి.. అధికారికంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ వ్యవహారంపై ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఓ వైపు వాణి, మరోవైపు మాధురీ.. ఇంకోవైపు దువ్వాడ మీడియా ముందుకొచ్చి ఎవరి వర్షన్‌లు వాళ్లు చెబుతున్నారు. ఇవన్నీ కాసేపు అటుంచితే.. ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్.. అచ్చెన్నాయుడిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడేశారు. బూతులు తిట్టేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయ్. ఎప్పుడూ ఎవరికీ గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఏకవచనంతోనే సంబోధించేవారు. అంతేకాదండోయ్.. నీతి సూత్రాలు కూడా ఈయన నోట వచ్చాయ్.. సరిగ్గా ఇప్పుడు దువ్వాడ ఉన్న పరిస్థితులకు అవన్నీ సింక్ చేస్తూ సొంత పార్టీ నేతలే దుమ్మెత్తి పోస్తున్నారు.
గట్టిగానే..!
ఒక్కో మగాడు కొన్ని వేలమందిని పెళ్లి చేసుకోగలడు.. కానీ పద్ధతీ, సంస్కారం, హిందూమతం వంటివి అడ్డువస్తాయి. ఓ తెలుగువాడిగా ఏకపత్నీవ్రతమే మన మతం. ఒకే స్త్రీనే పెళ్లాడి.. ఆ స్త్రీతోనే జీవితం పూర్తిచేయడం మన సంప్రదాయం. అటువంటి సంప్రదాయానికి తూట్లు పొడిచిన నీచుడు పవన్ కల్యాణ్ అంటూ అధికారంలో ఉండగా నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేశారు. ఇప్పుడు దువ్వాడ ఎపిసోడ్‌తో పాత విషయాలన్నీ వీడియోల రూపంలో బయటికి తీసి మరీ కౌంటర్లిస్తు్న్నారు జనసైనికులు. మాధురి వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ఇవన్నీ దువ్వాడకే ఆపాదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అధికారంలో ఉంటే అలా.. లేకుంటే ఇలానా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి కూడా ఇసుమంత సపోర్టు కూడా రాకపోవడం గమనార్హం. కొందరైతే ఏముందిలే.. ఒకరికి విడాకులు ఇచ్చేసి కావాల్సిన వాళ్లతో ఉండొచ్చు కదా.. అదేనబ్బా పవన్ కల్యాణ్ లాగానే అంటూ వైసీపీ కార్యకర్తలు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
సారీ చెబుతున్నట్టేనా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. దువ్వాడతో ఉంటున్న మాధురీ తాను పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌ను అని.. చిన్నప్పటి నుంచీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. పవన్ పెళ్లిళ్లపై తాను ఎప్పుడూ కామెంట్స్ చేయలేదని కూడా స్పష్టం చేశారామె. మరోవైపు.. దువ్వాడ కూడా పవన్ పెళ్లిళ్లపై తాజాగా స్పందించారు. పవన్ 2,3 వివాహాలకు దారితీసిన పరిస్థితులు ఏవో నాకు తెలియదు కానీ.. ఏదో ఒక సమస్య వల్లే.. ఇష్యూ వచ్చి ఉంటేనే అలా చేసి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి సమస్యే నా వరకు వచ్చేసరికి కాబట్టే సమస్య అర్థమైంది అని ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో తత్వం బోధపడిందని చెప్పుకోవచ్చన్న మాట. అదే ఎదుటి వారివైపు వేలెత్తి చూపించేటప్పుడు.. ఒక వేలు అటుంటే.. మిగిలిన వేళ్లు అన్ని ఇటే ఉంటాయన్న విషయం మరిచిపోతే ఇలాగే ఉంటుందేమో..! పవన్ విషయంలో దువ్వాడకు బాగానే సీన్ అర్థమైనట్టుంది.. రేపు మాపో సేనానికి సారీ చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూశారుగా.. ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే సీన్ రివర్స్ అవుతుంది మరి..!