Advertisement
Google Ads BL

ఫ్యాన్‌ రెక్కలు ఊడుతున్నాయ్.. చూస్కో జగన్!


అవును.. ఫ్యాన్‌కు రెక్కలూడుతున్నాయ్..! ఊడినవన్నీ ఒక్క చోటికి చేర్చి రిపేర్ చేయకపోతే పెద్ద తలనొప్పే వచ్చి పడేట్లు ఉంది..! అదీ వర్కవుట్ కాకపోతే ఇక ఫ్యాన్ పనికి రాదని పక్కనెట్టేయాల్సిందే..! అందుకే జర జాగ్రత్తగా చూసుకుంటే మంచిదేమో..! ఇదంతా ఏ పార్టీ గురించి చెబుతున్నానో.. ఆ పార్టీ అధినేత ఎవరో ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది కదా..! అదేనండోయ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే..! వైనాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లి.. క్రికెట్ టీమ్‌ 11కు పరిమితమైన వైసీపీ.. ఇప్పుడు ఉన్న కాస్త టీమ్‌ను, మాజీలను కాపాడుకోలేని పరిస్థితుల్లో అధినేత ఉండటంతో క్యాడర్‌లో కంగారు, ఆందోళన చెందుతోంది..!

Advertisement
CJ Advs

ఇంకెన్నాళ్లు ఇలా..!

2024 ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ.. మునుపెన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది..! 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలకే పరిమితమైన జగన్ టీమ్.. ఇప్పుడు మాజీలు, సీనియర్లు, కీలక నేతలు, సౌమ్యులు, వివాదరహితులు, పార్టీకి నిబద్ధులుగా పనిచేసినవారు, మృదుస్వభావులు ఇలా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కింద సేద తీరింది చాలని గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆ నేతలంతా సైకిల్‌పై సవారీ చేయడానికో.. గ్లాస్‌ను మరింత గట్టిగా చేద్దామనో.. కాషాయ కండువా కప్పుకోవాలని రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు. ఇందుకు ఒకే ఒక్క కారణం వైఎస్ జగన్ తీరు అన్నదే ఎవరి నోట చూసినా వినిపిస్తున్న మాట. ఇంకెన్నాళ్లు నిరంకుశ వైఖరిని చూస్తూ ఊరుకుండాలని తీవ్ర అసంతృప్తి రగిలిపోయి.. టాటా చెప్పేస్తున్నారు. ఘోరాతి ఘోరంగా పార్టీ ఓడిపోయినా జగన్ మారట్లేదని.. వైసీపీ నేతలే మారిపోతున్నారు..! ఇందులో కొందరు తమను పట్టించుకోవట్లేదని అంటుంటే.. మరికొందరు దారుణంగా ట్రీట్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అందుకే విసిగివేసారిపోయి.. జనాల్లోకి వెళ్తే ఎక్కడ తంతారో అని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ కార్యాలయాలు సైతం మూసేసి, వాటిని చిరు హోటళ్లుగా మార్చేస్తున్నారు.

అయినా.. మారలేదు!

కూటమి సర్కార్‌కు హనీమూన్ పిరియడ్ కోసం టైమ్ ఇస్తున్నాం.. ఆ తర్వాత ఇక కదన రంగంలోకి దూకేస్తాం అని జగన్ ప్రగల్భాలు పలికిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఆయన పార్టీకి వర్తిస్తుందనే విషయం మాత్రం మరిచిపోయారు. ఎన్నికలు పూర్తయ్యి ఇన్నాళ్లు అయినా అధినేత చేసిందేమీ లేదని.. కనీసం ఎందుకు ఓడిపోయాం..? నవరత్నాలు, చెప్పినవి..  చెప్పనవి.. బటన్లు నొక్కుడు, కాస్తో కూస్తో అభివృద్ధి.. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోని ప్రజల ప్రాణాలను కాపాడటం.. ఇలా ఒకటా రెండా ఎన్నో.. ఎన్నెన్నో చేసినప్పటికీ 11 స్థానాలకే ఎందుకు వైసీపీని పరిమితం చేశారు..? అసలు లోపం ఎక్కడుంది..? ఎంతసేపూ ఈవీఎంల వల్లే ఇదంతా జరిగింది.. అనే విషయాలను పక్కనెట్టి పోస్టుమార్టం మొదలుపెట్టాల్సింది పోయి.. ఇంతవరకూ ఆ దిశగా అడుగులు వేసినట్లు ఏ మాత్రం కనిపించట్లేదు. దీంతో ఎన్నికల ఫలితాల మరుసటి రోజు రావెల కిశోర్ బాబుతో మొదలైన జంపింగ్‌లు ఆళ్ల నాని వరకూ వచ్చి ఆగింది. పోనీ.. పోయిన నేతలంతా ఏమైనా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అస్సలు కానే కాదు.. దాదాపు అందరూ సౌమ్యులే.. కాకలు తీరిన వారే..! అయినప్పటికీ వైసీపీని వీడుతున్నారంటే పార్టీలో ఏం జరుగుతోందో.. తెలుసుకోవాల్సిన.. మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎలా..!

నాడు.. నేడు!

2014, 2019లో వైసీపీ ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. 2019లో ఫుల్.. హౌస్‌ఫుల్‌గా ఉండేది. ఇప్పుడున్న వైసీపీ పరిస్థితులు నాడు టీడీపీకి ఉండేవి. అయితే.. ఐదంటే ఐదేళ్లలోనే సీన్ మొత్తం మారిపోయింది. కొందరు రాజీనామా చేస్తే.. మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇంకొందరు జంపింగ్‌లు.. రేపొద్దున్న ఎమ్మెల్సీ ఎన్నికలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గెలిస్తే పరువు నిలుపుకున్నట్లు.. లేదంటే ఆయన పార్టీలోనే ఉంటారని మాత్రం ఎవరూ అనుకోరట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు గెలిచిన 11 మందిలో ఒక్క జగన్.. ఇంకొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే అబ్బే అస్సలు లేరంటే లేరు గాక. ఇదీ కాదు.. మాజీలు ఎవరైనా ఉన్నారా అంటే.. అధికారంలో ఉన్నన్ని రోజులు అనుభవించి అడ్రస్ లేకుండా పోయినోళ్లే కనిపిస్తున్నారు. ఒకే ఒక్క పేర్ని నాని మాత్రమే కాస్తో కూస్తో మీడియా ముందుకు వచ్చి కూటమి సర్కార్, విమర్శలకు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పార్టీ స్థాపించినప్పుడు వైసీపీ ఎలా ఉందో.. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రేపొద్దున్న బూత్ కమిటీలు, జిల్లా అధ్యక్షులను కేటాయిస్తే ఇంకెంత మంది జంప్ అవుతారో పైనున్న పెరుమాళ్లకే ఎరుక. మరోవైపు.. ఇదే సరైన సమయంలో అని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు డోర్లు తెరిచేసి ద్వితియ శ్రేణి మొదలుకుని నేతలు, ముఖ్యనేతలు ఎవరొచ్చినా కండువాలు కప్పేస్తున్నారు. ఇకనైనా పార్టీలో మార్పులు, చేర్పులు చేసి.. అవసరమైతే యూత్‌ను ఎంకరేజ్ చేసి, ఉడుకు రక్తాన్ని ఎక్కిస్తే ఫ్యాన్ కాస్త తిరుగుతుందేమో ఒకసారి ఆలోచించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ మనసులో ఏముందో మరి..!

 

Fan wings are blowing.. Look at the pictures!:

Take a look at the Jagan.. YCP is about to close!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs