కేరళ వయనాడ్ కుండపోత వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలతో వయనాడ్ పరిసరప్రాంతాలు అతలాకుతలం అవడం కాదు.. ఏకంగా గ్రామాలే నామ రూపాలు లేకుండా పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. కేరళ వయనాడ్ కుంభవృష్టిలో ఇప్పటికి 315 మంది వరకు మృతి చెందగా.. మరో 200మంది ఆచూకీ తెలియరావడం లేదు. ఇండియన్ ఆర్మీ నిరంతరం శ్రమిస్తోంది. అడుగడుగునా స్మశాన్ని తలపిస్తున్న వయనాడ్ ని చూసి సెలబ్రిటీస్ చలించిపోయి తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు.
అందరికన్నా ముందుగా తమిళ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, కార్తీలు 50 లక్షల విరాళం ప్రకటించగా ఆ తర్వాత ఒకొక్కరుగా అంటే నయనతార, ఫహద్ ఫాసిల్, దుల్కర్, మమ్ముట్టి ఇంకా చాలామంది హీరోలు వయనాడ్ వరద బాధితులకు సహాయ చేస్తున్నారు. మోహన్ లాల్ అయితే 3కోట్లు భారీ విరాళం ప్రకటించడమే కాదు ఆయన కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు.
ఇక టాలీవుడ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ తీస్తూ కేరళలో అంటే మలయాళంలోనూ తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా చాలామంది హీరోలు తమ సినిమాలను కేరళలోని విడుదల చేస్తున్నారు. అయితే వయనాడ్ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ 25 లక్షల విరాళం ప్రకటించిన కొద్ధి నిమిషాల్లోనే మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ తో సహా కోటి విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు.
దానితో టాలీవుడ్ లో ఓన్లీ మెగా ఫ్యామిలీనేనా కేరళకు సహాయం చేసేది.. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా హీరోలెవరు కేరళను పట్టించుకోరా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమ సినిమాలు అక్కడ విడుదల చేసి క్యాష్ చేసుకుని, క్రేజ్ తెచ్చుకున్న హీరోలు కూడా కేరళకు ఎంతో కొంత సహాయం చేస్తే బావుంటుంది అంటున్నారు.