Advertisement

చంద్రన్నను చూసి నేర్చుకో జగన్!


అవును.. ఎంతైనా సీనియర్.. సీనియరే కదా! సీనియర్ నుంచి జూనియర్ ఎన్నో తెలియని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది..! అది ఏ రంగంలో అయినా సరే.. నేర్చుకోవాల్సిన లక్షణాలు.. మనలో మార్పులు, చేర్పులు  చేసుకోవాల్సినవి సవాలక్ష ఉంటాయ్..! ఇక ఆ విషయాలన్నీ కాస్త పక్కనెట్టి ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల దగ్గరికి వచ్చేద్దాం..! ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు.. ఈయన రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని వచ్చినవారున్నారు. ముఖ్యంగా టీడీపీ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు, నేతలను ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా సరే క్యాడర్.. క్యాడర్ అంటూనే ఉంటారు.

Advertisement

ఎంత తేడా..!

ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో.. పార్టీ నిలబడాలంటే క్యాడర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడైతే వీక్ అవుతూ వస్తుందో సీన్ మొత్తం మారిపోతుంది. అదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ప్రవర్తించకుండా.. క్యాడర్‌ను మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడే నాయకుడు అంటే..! ఇలాంటి వారిలో టీడీపీ అధినేత మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే.. 2019 నుంచి 2024 వరకూ టీడీపీ కార్యకర్తలు, నేతలు.. ఆఖరికి చంద్రబాబును కూడా వైసీపీ ఎంతలా ఇబ్బంది పెట్టిందో మనందరం చూసే ఉంటాం. అయినా సరే ఎక్కడా క్యాడర్‌ డీలా పడటం కానీ జరగలేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు.. దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు గంటల వ్యవధిలోనే చంద్రబాబు ఆ కార్యకర్త ఇంటి ముందు వాలిపోయేవారు. అలా కొన్నేళ్లుగా క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చి.. 2024 ఎన్నికల్లో కనివినీ ఎరుగని మెజార్టీని దక్కించుకున్నారు. ఇదే విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తే.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.

మార్పు మంచిదే జగన్!

వైసీపీ స్థాపించిన నాటి నుంచి 2019 వరకూ అంటే ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ క్యాడర్ మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు పట్టించుకోలేదన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే కదా. వాస్తవానికి ఎన్నడూ కార్యకర్తలను కలవడానికి ప్రత్యేక సమావేశాలు కానీ.. కనీసం ఫోన్‌లో పరామర్శ కానీ చేసిందేమీ లేదు. అదే చంద్రబాబు అయితే.. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు, నేతల సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం కల్పించి మరీ.. పరిష్కార మార్గం చూపడం అంటే ఆషామాషీ కాదు. మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని అధినేత వరకూ అందరూ స్వయంగా సమస్యల తాలుకా దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించారు. అదే జగన్ అయితే.. తాడేపల్లి గేట్లును ఎప్పుడూ కార్యకర్తలను టచ్ చేయనిచ్చిన సందర్భాల్లేవ్. తత్వం బోధపడిందేమో కానీ.. ఇప్పుడిప్పుడే ప్యాలెస్ గేట్లు తెరుచుకుంటున్నాయ్.. కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు జగన్. అందుకే.. క్యాడర్‌ను కాపాడుకునే విషయంలో ఇగోకు పోకుండా చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు మంచిదే.. మారి క్యాడర్‌ను కాపాడుకుంటే పార్టీకే మంచిది కదా.. లెట్స్ గో జగన్!

Look at the Chandrababu and learn Jagan!:

Chandrababu Naidu Vs Jagan Mohan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement