తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామమే చోటుచేసుకుంది..! ఈ ఒక్క ఘటనతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అవక్కైన పరిస్థితి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు పది మందికి పైగా ఎమ్మెల్యేలు.. ఆరు మంది ఎమ్మెల్సీలు.. పలువురు కీలక నేతలు కారు దిగి.. కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి తిరిగి బీఆర్ఎస్ గూటికి వచ్చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసేశారు. అది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలోనే ఇదంతా జరిగింది.
ఊహించలేదే..!
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జులై-06న బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి ఆరు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారన్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ట్విస్టే చోటుచేసుకుంది. బండ్ల తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కేటీఆర్‌తో భేటీ అయ్యి.. కీలక నేతలు మధ్య నేనిక బీఆర్ఎస్‌లోనే ఉంటానని మాటిచ్చేశారు కూడా. దీంతో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. వాస్తవానికి ఈయన చేరికను కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అనుకున్నట్లే.. ఆ వ్యతిరేకత కాస్త చినికి చినికి గాలి వానయినట్లుగా అయ్యింది. దీంతో తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చేశారు కృష్ణమోహన్. నిజంగా ఈ ట్విస్ట్‌ను అటు కాంగ్రెస్ కానీ.. ఇటు బీఆర్ఎస్ కానీ అస్సలు ఊహించి ఉండదేమో..!
కారులోనే ఇక..!
ఇప్పుడు కేటీఆర్‌ను కలిశాను.. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని కారు పార్టీలోనే ఉంటానని కుండ బద్ధలు కొట్టారు ఎమ్మెల్యే. తన ఎమ్మెల్యే పదవికి అనర్హత విషయంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత కోర్టులో పిటిషన్ వేశారు. అది కోర్టులో నడుస్తోందన్నారు. 2018, 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనర్హత వేటు వేయాలని కోర్టులను ఆశ్రయించారని.. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీనే లాయర్‌ను పెట్టి వాదించిన విషయాన్ని గుర్తు చేశారాయన. అయితే.. పార్టీ నుంచి బయటికొచ్చా లాయర్‌ను తీసేయడం.. ఇప్పుడు కేటీఆర్ మాటతో మళ్లీ లాయర్‌ను పెడతామన్న విషయాన్ని చెప్పారు. దీనికి తోడు తాను.. లాయర్ ఫీజు కూడా చెల్లిస్తానని చెప్పేశారు ఎమ్మెల్యే. మొత్తానికి చూస్తే.. సీన్ ఇప్పుడిప్పుడే రివర్స్ అవుతోంది.. కేటీఆర్ గట్టిగానే చక్రం తిప్పుతున్నారన్న విషయం ఇక్కడ గమనించొచ్చు. ఈ ఒక్క ఎమ్మెల్యేతోనే ఆగుతుందా లేకుంటే.. మరింత మందిని వెనక్కి తీసుకుంటారా..? అనేది వేచి చూడాల్సిందే మరి.