పెద్దిరెడ్డీ.. ఇంకా మౌనమేల..?
అవును.. అంతా నేనే.. సర్వం నాదే.. నేను చెప్పిందే వేదం.. మాట వింటే సరే.. కాదని అడ్డొస్తే తొక్కేస్తా.. రాయలసీమ మొత్తం నాకే రాసిచ్చేశారు..! బాబోయ్ ఇలా ఒకటా రెండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీలలు అన్నీ ఇన్నీ కావు. సీన్ కట్ చేస్తే రాయలసీమ కాదు కదా సొంత జిల్లాలో.. ఆయనపైనే లెక్కలేనన్ని ఆరోపణలు.. అంతకుమించి విమర్శలు, ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు సిసలైన ఎమ్మెల్యే పదవికే ఎసరొచ్చి పడింది..? ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి అయినా సరే ఎక్కడా కదలిక లేదు.. అసలు రెడ్డిగారు మునుపటిలా ఎందుకులేరు..? ఎందుకింత మౌనం..? అసలేం జరుగుతోంది..? అంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆలోచనలో పడ్డారు!
అర్థమవుతోందా..!
సౌమ్యుడు.. పెద్ద మనిషి.. రాజకీయ చాణక్యత కలిగిన మనిషి ఇవీ పెద్దిరెడ్డిని పైపైన చూసిన వ్యక్తులు చెబుతున్న మాట. అయితే.. ఆయన ఎలాంటి వ్యక్తి అధికారంలో ఉన్నా లేకున్నా ఎలా ఉంటారనేది ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.. ఇదీ సొంత పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న మాట. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే పెను సంచలనం సృష్టించింది. అటు తిరిగి ఇటు తిరిగి వేళ్లన్నీ రామచంద్రారెడ్డి దగ్గరే వచ్చి ఆగుతున్నాయ్. ఇప్పటికే ఆయన పీఏ శశిధర్ విదేశాలకు పారిపోగా.. ఇంట్లో సోదాలు చేసి కీలకపత్రాలు సేకరించడం, మరోవైపు ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని ఇప్పటికే అదుపులోనికి తీసుకోవడం.. ఇవన్నీ ఒక ఎత్తయితే సోదరుడి ఇంట్లో పోలీసులు తనిఖీలు.. ఒకటిరెండ్రోజుల్లో పెద్దిరెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతను కూడా విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సర్కారు చేతిలో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి గుట్టు అయితే ఉందన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఇంత జరుగుతున్నా ఆయనకు అర్థమవుతోందా లేదా ఎవరికీ అర్థం కాని విషయం.
ఉన్న పదవీ పోతే!
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో గెలిచిన ఒకే ఒక్కడు పెద్దిరెడ్డే. పుంగనూరు అడ్డా.. పెద్దిరెడ్డి అడ్డాగా ఇన్నాళ్లు నడిచింది..! అలాంటిది ఇప్పుడు ఆయనపైన ఏ క్షణమైనా అనర్హత వేటు పడుతుందన్నది నడుస్తున్న చర్చ. ఇదంతా హైకోర్టు, సుప్రీంకోర్టులో నడుస్తున్నది. నామినేషన్ అఫిడవిట్‌లో 142 ఆస్తులను పేర్కొనకుండా దాచిపెట్టారని.. దీంతో ఆయన్ను పోటీకి అనర్హుడిని చేయాలని రామచంద్రయాదవ్ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్, వివిధ ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ కేసు వ్యవహారం ఎప్పుడేం అవుతుందో తెలియట్లేదు. అతి త్వరలోనే ఎమ్మెల్యే పదవి పోతుందని మాత్రం ఓ రేంజిలోనే చర్చ నడుస్తోంది. అటు ఇటు అంతా పెద్దిరెడ్డిని అయితే పీకల్లోతు కష్టాలు వెంటాడుతున్నాయ్.. మెడకు అన్నీ చుట్టుకుంటున్నాయ్.! చూశారుగా.. మదనపల్లి ఘటన మొదలుకుని విచారణ, ఎమ్మెల్యే పదవి వరకూ ఇంత జరుగుతున్నా ఇంకా పెద్దిరెడ్డి ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. పోనీ మౌనానికి అర్థం అంగీకారమేనా..? అనేది ఇప్పుడు సొంత పార్టీ నేతలకు వస్తున్న డౌట్. ఏం జరుగుతుందో చూడాలి మరి.