విజయమ్మతో జేసీ భేటీ.. ఇదేం ట్విస్ట్?
అవును.. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు..! ఒకప్పుడేమో కానీ ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్నారు..! అలాంటిది సడన్‌గా ఉప్పు ఇంట్లో నిప్పు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది..? ఇంకేముంటుంది.. ఒక్కటైపోయినట్లే అనుకుంటున్నారేమో.. కానే కాదండోయ్..! ఇంతకీ ఇదంతా ఎవరి గురించి..? ఎందుకు అనేది..? ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది కదా..! అదన్న మాట సంగతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మతో.. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. నిజంగా ఇది ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం.. అంతకుమించి ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఎందుకబ్బా..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకూ రెండున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ ఫ్యామిలీ.. ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత పరిస్థితుల రీత్యా టీడీపీలో చేరాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఇక జేసీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీగా పరిస్థితులు మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. 2009 వరకూ ఓ ఎత్తయితే.. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా తయారయ్యాయి. ఇక వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 2019 నుంచి 2024 వరకూ అయితే అబ్బో.. జేసీ ట్రావెల్స్ మూసివేత, కేసులు.. అరెస్ట్ ఇలా పెద్ద కథే నడిచింది. ఇంత జరిగినప్పటికీ తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం జగన్ ఎలాంటి జోక్యం చేసుకోకుండా.. జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్‌ను చేశారు. ఇక ఎలాగో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఫ్యామిలీగా పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండనే ఉన్నాయి. జగన్ అంటే చాలు ఒంటి కాలిపై లేచే జేసీ కుటుంబీకులు.. సడన్‌గా ఎందుకో శాంతించి.. హైదరాబాద్ వేదికగా లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ నివాసానికి స్వయంగా వెళ్లిన ప్రభాకర్ రెడ్డి సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ ఊహించని పరిణామం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
జస్ట్ అంతే..!
లోటస్‌పాండ్ పరిసర ప్రాంతాల్లోనే జేసీ ప్రభాకర్ ఇల్లు కూడా ఉంటుంది. అందుకే అటువైపుగా వెళ్తున్న ఆయన.. విజయమ్మ ఉన్నారని తెలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించారు. టీ తాగిన జేసీ.. తాజా రాజకీయ పరిణామాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌పై చర్చించినట్లుగా తెలుస్తోంది. వైఎస్సార్‌ను గుర్తుకు తెచ్చి జేసీ, విజయమ్మ ఇద్దరూ ఎమోషనల్ అయినట్లుగా సమాచారం. ఇంకా ఏమేం చర్చించారు..? అసలు ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది..? అనే విషయాలు ఎక్కడా బయటికి రాలేదు కానీ.. ఫొటో మాత్రం రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారితీసింది. పాత రోజులు గుర్తొచ్చాయని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉండగా.. ఈ ఫొటో చూసిన తర్వాత వైఎస్ జగన్ ముఖ చిత్రమేంటో చూడాలని ఉందని మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు కదా..!