అవును.. కొత్తగా కేంద్రం మాకిచ్చిందేంటి..? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారు అంతే కదా..! అందరూ బడ్జెట్‌లో ఏపీకి ఏదో ఇచ్చారని అనుకుంటున్నారు కానీ.. బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదు..! ఒకటా రెండా ఎన్నో చెప్పారు కానీ ఏపీకి ఏమిచ్చారో చెప్పండి..! ఇవీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి అయోగ్ సమావేశం తర్వాత మాట్లాడిన మాటలు. అసలే గత ఐదేళ్లు వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. అభివృద్ధి, రాజధాని అన్నింటినీ గాడిలో పెడదాం అనుకుంటే కేంద్రం ఇచ్చిందేమీ లేదు.. పైకి మాత్రం ఏదో ఇచ్చేశాం అన్నట్లుగా ఎన్డీఏ ఓ వైపు.. చాలా ఇచ్చేసిందని ఇండియా కూటమి మరోవైపు చెబుతోంది కానీ.. రియాల్టీకి వస్తే ఏమీ లేదని కుండ బద్ధలు కొట్టి చెప్పేశారు చంద్రబాబు..! ఒకానొక దశలో కేంద్రంపై చండ్రనిప్పులు చెరుగుతున్నట్లే మాట్లాడేశారు..!
అసలేం జరిగింది..!
జులై-27న ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం జరిగింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవ్వగా.. చంద్రబాబు కూడా వెళ్లారు. మీటింగ్‌లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఏపీకి ఏం కావాలి..? ఇప్పటి వరకూ ఏమిచ్చారు..? ఇంకేం కావాలి..? ఇలా అన్ని విషయాలను పూసగుచ్చినట్లుగా వివరించారు బాబు. అయితే సమావేశంలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. బయటికొచ్చాక మీడియాతో మాట్లాడుతూ సీబీఎన్ ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఏపీకి ఏమిచ్చారో కేంద్రం చెప్పాలి..? అమరావతి పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలో ఉన్నాయి..? కానీ కేంద్రం ఏం చేసింది..? ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. హోదా బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సహాయం చేస్తామని చెప్పారు.. ఏం చేశారు..? విభజన సమయంలో ఆంధ్ర- తెలంగాణకు తలసరి ఆదాయం చాలా తేడా ఉంది.. వీటన్నింటికీ కేంద్రం చేసిందేంటి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదేం పద్ధతి..?
గడిచిన 5 ఏళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయింది. తలసరి ఆదాయం కూడా పడిపోయింది. పోలవరం, అమరావతి నాశనం అయిపోయింది.. ఇండస్ట్రీలు పారిపోయాయి. ప్రజలు ఎన్డీఏపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నాం. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ కారణం. జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఎన్డీఏకు చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారన్న విషయాన్ని ఓ వైపు ప్రశ్నిస్తూనే.. బాధ్యతను బాబు గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత ఇచ్చారన్న విషయం మరిచిపోకూడదు.. అందుకే రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నామే తప్ప కొత్తగా ఏమీ అడగట్లేదు.. కేంద్రం కూడా ఇచ్చింది ఏమీ లేదని ఒక్క మాటతో బడ్జెట్ సారాంశాన్ని చెప్పేశారు చంద్రబాబు. అయితే రాష్ట్రానికి ఏదో ఇచ్చేశారని కావాలని రాజకీయం చేస్తే కరెక్ట్ కాదని.. స్వచ్ఛ భారత్, జల జీవన మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారాయన. ఓ వైపు రాష్ట్రానికి రావాల్సినవన్నీ బాధ్యతగా ప్రశ్నిస్తూనే.. కూటమిపై ఉన్న బాధ్యతలను సైతం గుర్తు చేశారు.