రేవంత్‌కు బాగానే తెలిసొచ్చిందే!
అవును.. అదేదో అంటారో మన దాకా వస్తే గానీ.. ఆ బాధ, ఆ నొప్పి తెలియదంటారే..! సరిగ్గా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అనుభవిస్తున్నారు.! బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోనే ఉన్నది.. ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉన్నారు..! ఈ పదేళ్లు తెలంగాణకు నయా పైసా కూడా రాలేదని మీడియా ముందుకు, బహిరంగ సభల్లో గులాబీ బాస్ పదే పదే చెబుతూనే వచ్చారు. అందుకే రాష్ట్రంలోనే ఎలా ఆదాయం పెంచాలనే దానిపైనే దృష్టి పెట్టారు. పదేళ్ల పాటు ఇలానే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రంలో ఎప్పుడూ జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అనుభవించాలా.. మనం ఎందుకు ఉండకూడదు..? అని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని మార్చి దేశ్ కి నేతగా మారాలని చూశారు కానీ ఇక్కడే బొక్క బోర్లా పడ్డారు బాస్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇప్పుడైనా కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒక్క పైసా ఐనా ఇస్తుందనుకుంటే అబ్బే మళ్ళీ అదే పరిస్థితి.. పాత పద్ధతినే కంటిన్యూ చేసింది కేంద్రం. దీంతో నాడు కేసీఆర్ ఎందుకు ఇలా అన్నారు..? కేంద్రంతో ఎందుకు అలా ప్రవర్తించారు..? అనేది ఇప్పుడిప్పుడు రేవంత్ రెడ్డికి బాగా తెలిసివస్తోంది.
అబ్బే అస్సలు ఏమీ ఉండదు!
తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కేసీఆర్ ఎలా ప్రవర్తించేవారు అనేది అందరికీ తెలిసిందే. ఇలా ఎందుకు ప్రవర్తించారు..? అనేది పైన చాలా వివరంగా చెప్పాం కాబట్టి తెలిసే ఉంటుంది. బహుశా రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియకపోయేసరికి మోదీ మారిన మనిషి ఏమో అని.. తెలంగాణకు వచిన్నపుడల్లా ఎదురువెళ్లి మరి స్వాగతం పలకడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం.. పెద్దన్న, బడేమియా అంటూ ఆకాశానికి ఎత్తేశారు..! ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి మరీ ప్రధాని మోదీతో.. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు కూడా అయ్యారు. సీన్ కట్ చేస్తే ఈ పొగడ్తలకు కానీ..
ఎక్కడా పడిపోక పోగా బడ్జెట్ చూస్తే సీన్ మొత్తం అర్థమై పోయింది. అందుకే ఇకపై మోదీని కలవడం, రాష్ట్రానికి వస్తే అస్సలు పట్టించుకోకూడదని ఫిక్స్ అయ్యారట. అంటే నాడు కేసీఆర్.. నేడు రేవంత్ ఇద్దరూ ఈ విషయంలో మాత్రం ఒక్కటే అవుతున్నారు అన్న మాట.
పల్లీ బఠాణీలు అంతే!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. నీతి ఆయోగ్ సీఎంల భేటీకి కూడా కేసీఆర్ వెళ్ళేవారు కాదు. ఎందుకలా అని అడిగితే.. అక్కడికి వెళ్లినా ప్రయోజనం ఏమీ ఉండదని పల్లి బఠానీలు తిని రావడం తప్పా మనం చెప్పేది ఏదీ ప్రధాని పరిగణనలోకి తీసుకోరని బీఆర్‌ఎస్ అధినేత చెప్పేవారు. దీంతో అప్పట్లో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశాలకు ఎందుకు వెళ్ళరు..? వెళ్లి రాష్ట్ర సమస్యలు.. ఏం కావాలి అనే దానిపై గళం ఎందుకు విప్పలేదు..? అని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ఇప్పుడు రేవంత్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళడం లేదు. ఇందుకు కారణం బడ్జెట్ తర్వాత పెద్దన్నను కలవడానికి తమ్ముడు రేవంత్ అస్సలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే.. తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మొత్తానికి చూస్తే.. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ అంతే అన్న మాట.