భయమా.. విజనరీ ఏమైంది సీబీఎన్?
ఆవేదన ఉంది.. మనం హామీలు ఇచ్చాం.. సూపర్ సిక్స్ చెప్పాం.. చూస్తే భయమేస్తోంది! ముందుకు కదల్లేక పోతున్నాం.. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి.. ఆలోచించాలి..! సీరియస్‌గా ఆలోచించాల్సిందే..! అవునా ఇవన్నీ ఎవరన్నారు..? ఎందుకిలా..? ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చింది..? అనే సందేహాలు వచ్చాయ్ కదూ..! అవును మీరు వింటున్నది నిజమే.. ఇవన్నీ అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో.. మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. అదేంటి బాబు అప్పుడలా అన్నారు..? ఇప్పుడేమో ఇలా అంటున్నారు..? అసలేం జరుగుతోంది..? ఇంతకీ సూపర్ సిక్స్ హామీల సంగతేంటి..? అమలు అవుతాయా..? కావా..? అని జనాలంతా చర్చించుకుంటున్న పరిస్థితి.
ఇదిగో ఓ లుక్కేయండి!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తాను. ఇంకా సంపద సృష్టిస్తా.. ఆదాయాన్ని పెంచుతా.. ఆ పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్ల కోసం ఖర్చు పెడతా..! అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఓ రేంజిలో చంద్రబాబు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అసెంబ్లీ వేదికగా ఏవేవో మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు, ఓటేసి గెలిపించిన ఓటర్లు నానా రకాలుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంతకీ హామీలు అమలు చేస్తారా.. లేదా..? ఇప్పుడిదే ఏ ఒక్కరిని కదిలించినా మాట్లాడుతున్న మాట. అయినా విజనరీ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్, అది నేనే.. ఇది నేనే అని చెప్పుకునే చంద్రబాబు సూపర్ సిక్స్‌కు భయపడటమేంటి..? అనేది అర్థం కావట్లేదని రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
మొన్న.. నిన్న.. ఇవాళ!
అసలే సూపర్ సిక్స్ అమలు అవుతాయని.. గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే అన్నీ ఉంటాయని కూటమికి ఓటేసి గెలిపించారన్నది అక్షరాలా నిజం. అలాంటిది ఇవే అమలు చేయకుండా మొన్న అమ్మకు వందనం విషయంలో ఇప్పట్లో అవ్వదు, డేటా లేదు అని.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడంతో తల్లులంతా కంగుతిన్న పరిస్థితి. ఆ మరుసటి రోజే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇవ్వట్లేదని చెప్పడంతో యావత్ ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళ షాకయ్యారు. ఇప్పుడేమో ఏకంగా మొత్తమ్మీద సూపర్ సిక్స్ గురించి చంద్రబాబు.. భయమేస్తోంది.. ప్రజలు ఆలోచించాలి అని అనడంతో అసలేం జరుగుతోంది..? ఎన్నికల ముందు చెప్పిందేంటి..? గెలిచిన తర్వాత చేస్తోందేంటి..? అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా వైసీపీ, ఇతరులు అయితే నాడు బాబు మాట్లాడిన మాటలు, నేడు మాట్లాడిన మాటలను కలిపి ఓ రేంజిలో ఆటాడుకుంటున్నారు.
ఎందుకిలా..?
రోజుకో హామీపై మంత్రులు, ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం ఏంటి..? మంత్రులకు అంటే తెలియదో లేకుంటే.. మరేదో అనుకుంటే ఏకంగా సీఎం ఇలా చెప్పడమేంటి..? భయంగా ఉందని డైరెక్టుగా, అది కూడా అసెంబ్లీ వేదికగా అనడమేంటి..? సంపద సృష్టిస్తానన్న సీబీఎన్, అది కూడా పేదలకు పంచుతున్నాన్న ఆయన ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు..? మాట్లాడుతున్నారని మేథావులు, విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయినా కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. అన్ని విధాలుగా అండగా ఉన్నా ఇలా మాట్లాడటం ఏంటో ఆయనకే తెలియాలి మరి. విజనరీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి పని చెప్పి.. సంపద సృష్టించి తీరాల్సిందే.. సూపర్ సిక్స్ అమలు చేసి.. మిగిలిన సంపదను పేదలకు పంచి తీరాల్సిందేననే డిమాండ్ గట్టిగానే వస్తోంది. హైదరాబాద్, వైజాగ్, ఆల్ ఇన్ వన్ సృష్టించిన మీకు.. సంపద సృష్టించడం కొత్తేమీ కాదు.. అంతకుమించి పెద్ద విషయమేమీ కాదు.. ప్రజలు మీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు సీబీఎన్ సార్.. ఇక మొదలుపెట్టండి.. ఎనీ వే ఆల్ ది బెస్ట్..!