అవును.. అమ్మకు వందనం కాదు పంగనామం..! ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లకు మంగళం పాడేసిన పరిస్థితి..! ఇదీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు..!. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన సూపర్ సిక్స్ విషయంలో ప్రభుత్వం ఎందుకో ఒక్కోసారి ఒక్కమాట చెబుతూ చేతులెత్తేస్తోందనే ఆరోపణలు, విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఐనా సరే ప్రభుత్వం మాత్రం ఏవేవో సాకులు చెబుతూ వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
అవును.. ఈ ఏడాది కాదు!
ఇదిగో.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 18 వేలు అని ఎన్నికల ముందు నిమ్మల రామానాయుడు మొదలుకుని నారా లోకేష్, నారా చంద్రబాబు ప్రచారంలో ఎంతలా చెప్పారో అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అబ్బే అంటున్నారు..! ఫలితాలు వచ్చింది మొదలు, నిన్న మొన్నటి వరకూ ఇంతకీ ఇంట్లో ఉండే పిల్లలు అందరికీ వర్తిస్తుందా..? లేకుంటే ఒకరికేనా..? అనేది తెలియక విద్యార్థుల తల్లులు తలలు పట్టుకున్నారు. ఐతే ఈ అనుమానాలన్నీ, తల్లితండ్రుల ప్రశ్నలకు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున ఇస్తామని తేల్చి చెప్పేశారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇందుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని త్వరలో విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ ఇంత గట్టిగా చెప్పిన లోకేష్ ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది నుంచి అందజేస్తామని చెప్పడం గమనార్హం. పిల్లలను పాఠశాలలో చేర్చిన తల్లులు తమకు తల్లికి వందనం ఎప్పుడు వస్తుందా అని ఒకవైపు ఎదురుచూపులు.. మరోవైపు ప్రైవేటు స్కూల్లలో చేర్చిన పిల్లల తల్లులకు ఫీజు కోసం స్కూల్స్ నుంచి ఫోన్లు వచ్చేస్తున్న పరిస్థితి.. ఇలాంటి షాకింగ్ న్యూస్ ప్రభుత్వం నుంచి తల్లుల ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి.
ఉచితానికి మంగళం!
ఇక.. సూపర్ సిక్స్ లో మరొకటి.. ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి తర్వాత మంగళం పాడేసింది కూటమి సర్కార్. అసెంబ్లీ వేదికగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ప్రస్తుతానికి అమలు చేయట్లేదని ప్రకటించారు. దీంతో గ్యాస్ సిలిండర్ పథకానికీ మంగళం పాడేసినట్టు అయ్యింది. ఇప్పటికే ఉచిత ఇసుక, ఉద్యోగుల పెన్షన్లు విషయంలో కావాల్సినంత అపవాదు మూట కట్టుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు విషయంలో అంతకు మించి చెడ్డ పేరు తెచ్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ పరిస్థితి ఇలా అంటే.. సూపర్-6లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుండటంతో సీఎం చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. మున్ముందు ప్రభుత్వం ఇంకెన్ని షాకులు ఇస్తుందో అని రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.