జగన్ ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక వైసీపీ నేతలే తల పట్టుకుంటున్నారు. వినుకొండ ఘటనలో ఇద్దరు స్నేహతుల మద్యన జరిగిన హత్యని రాజకీయ హత్యగా మార్చి ఢిల్లీలో ధర్నా చేస్తా అంటూ.. ఢిల్లీకి పోయి ఇతర రాజకీయపార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసిన జగన్ కి అక్కడ నిరాశే మిగిలింది. ఈ ధర్నాలో ఏ పార్టీ కూడా జగన్ కి సపోర్ట్ చెయ్యట్లేదు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్లకుండా సేవ్ డెమోక్రసీ అంటూ హంగామా చేసి సైలెంట్ అయిన జగన్ ని చూసి సొంత నేతలే నెత్తినోరు కొట్టుకుంటున్నారు.
ఇక జగన్ గురించి వైసీపీ నేతలు మరింతగా టెన్షన్ పడుతున్న విషయం ఏపీకి మోడీ ఇచ్చిన బడ్జెట్ లెక్కలపై పెదవి విప్పకపోవడంపై కూడా జగన్ పై సొంత నేతలే విమర్శలు చేసేలా జగన్ ప్రవర్తించడం. జగన్ మాట్లాడకుండా మనమేం మాట్లాడతాము అనుకున్నారో ఏమో కనీసం వైసీపీలో ఒక్కరు కూడా కేంద్ర బడ్జెట్ విషయంలో స్పందించకుండా ఉండడం వైసీపీ కేడర్ ని నిరాశపరుస్తుంది.
కొన్నేళ్లుగా ఏపీకి మొండి చెయ్యి చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈసారి మాత్రం టీడీపీ-జనసేన సహాయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంతో ఏపీ కి మోడీ వరాల జల్లులా రాజధాని అమరావతి కోసం రూ.15 వేల కోట్లు కేటాయింపు తో పాటుగా పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
దానితో టీడీపీ-జనసేన తమ వలనే ఏపీకి మోడీ వరాలిచ్చారని సంబరపడుతుంటే.. రాష్ట్ర జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి మంచి రోజులు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది విమర్శించినవారూ ఉన్నారు. కానీ జగన్ మాత్రం ఏపీకి కేటాయించిన బడ్జెట్ పై నోరు విప్పలేదు. ఏపీకి భారీ స్థాయిలో కేటాయింపులు జరిగాయా, లేదా అనే విషయంలో వైసీపీ మౌనం వ్రతంలో ఉంది.
అయితే చంద్రబాబు కి క్రెడిట్ దక్కడం ఇష్టం లేని జగన్ బడ్జెట్ పై పొగడడం కానీ, లేదంటే విమర్శించడం కానీ చెయ్యడం లేదు అని కొందరు మాట్లాడుతుంటే.. అక్కడ మోడీని విమర్శించినా, చంద్రబాబును పొగిడిన మొదటికే మోసమని జగన్ అనుకుంటున్నారు అని మరికొందరు అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం జగన్ కి బడ్జెట్ పై స్పందించే విషయంలో ఈ మాత్రం తెలియదా అని గుసగుసలాడుకుంటున్నారట.