రేవంత్ రెడ్డీ.. నువ్వు చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? అసలు ఏం జరుగుతోంది..? అస్తమానూ ఏమిటీ గోల..? వారానికోసారి ఎందుకీ పంచాయతీ..? ఢిల్లీ వస్తావ్.. పోతావ్..? అని తెలంగాణ సీఎంకు కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడిదే రాష్ట్రంలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఈ దెబ్బతో ఇక కొడితే కొండనే కొట్టాలని రేవంత్ కూడా గట్టిగా ఫిక్స్ అయినట్లుగా సమాచారం. మరోవైపు.. రేవంత్ ప్లాన్‌తో బీఆర్ఎస్ కూడా ఇక అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
ఎందుకిలా..?
అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యి.. పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే పదిమందికి పైగా ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్.. కారును పూర్తిగా ఖాళీ చేసి ఆఖరికి ఆ నలుగురు (కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు) మాత్రమే మిగిలి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా ఇన్ఫో. ఖాళీ సంగతి తర్వాత.. మొదట బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలని అగ్రనేతల నుంచి ఆదేశాలు రావడంతో ఆ పనిలో నిమగ్నమైంది రేవంత్ అండ్ కో టీమ్. అయితే.. ఇలా కాకుండా వారానికో ఎమ్మెల్యేను ఢిల్లీకి తీసుకెళ్లడం, కండువా కప్పించి తీసుకురావడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహానికి లోనయ్యారట.
గట్టిగానే చీవాట్లు..!
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్‌ను కూర్చోబెట్టి మరీ ఖర్గే చీవాట్లు పెట్టారట. అసలు.. నువ్వు చెప్పింది ఏంటి..? చేస్తున్నది ఏంటి..? ఢిల్లీలో కాంగ్రెస్ పరువు తీస్తున్నావ్ కదయ్యా..? అని కన్నెర్రజేశారట. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎల్పీని (BRSLP) విలీనం చేస్తానని వారానికో ఎమ్మెల్యేకి కండువా కప్పి మీడియా ముందు హడావిడి చేస్తున్నావ్ ఏంటి..? ఎందుకిలా చేస్తున్నావ్..? అని ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు..? అని జాతీయ మీడియా మమ్మల్ని నిలదీస్తోంది..? సమాధానం చెప్పుకోలేక తల ప్రాణం తోకకొస్తోంది..? అని రేవంత్‌కు క్లాస్ తీసుకోగా.. ఇక అలా ఉండదు సార్.. చేరికలు గట్టిగానే అది కూడా ఒకేసారి ఉంటాయని మాటిచ్చి వచ్చారట. ఇకపై ఒక్క ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోకూడదని బీఆర్ఎస్ సైతం గట్టిగానే ఉందట. మరి ఫైనల్‌గా ఏమవుతుందో చూడాలి మరి.