గత ఐదేళ్లుగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై చాలామంది ప్రశంశలు జల్లు కురిపించగా టీడీపీ-జనసేన వాలంటీర్ వ్యవస్థపై పలు విమర్శలు చేసింది. జగన్ అధికారం చేపట్టగానే వృద్ధులను, వికలాంగులను బుట్టలో వేసుకునే ప్లాన్ లో భాగంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడు. వాలంటీర్లు కూడా తమ పని తాము చెయ్యకుండా వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ-జనసేన విమర్శలు చేసింది.
అయితే అదే వాలంటీర్ వ్యవస్థ వలన జగన్ నష్టపోయాడో.. లేదంటే లాభపడ్డాడో తెలియదు కానీ.. ఇప్పుడా వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ మంగళం పాడినట్లే అనిపిస్తుంది. ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే వృద్దులు ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణి చేసే వాలంటీర్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు ఐదు వేల నుంచి 10 వేలకు పెంచుతాను అంటూ హామీ ఇచ్చారు.
మధ్యలో వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు రాజీనాలు చేసారు. ఈసీ ఆదేశాలతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నన్ని రోజులు వృద్దులు గ్రామ సచివాలయానికో.. లేదంటే బ్యాంకు కు వెళ్లి పెన్షన్ తెచ్చుకునేవారు. దానితో వైసీపీ నేతలు వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు చేయించారు. అది కూటమి ప్రభుత్వానికి నచ్చలేదో ఏమో వాలంటీర్లను పక్కనపెట్టేసింది.
గత నెలలో పెన్షన్ పంపిణి కార్యక్రమంలో చంద్రబాబు తో సహా ప్రతి ఎమ్యెల్యే, మంత్రి కూడా ఇంటింటికి వెళ్లి తమ నియోజక వర్గాల వృద్దులకు పెన్షన్ ఇచ్చారు. రేపు ఆగస్టు 1 న కూడా ఇదే పద్దతి కొనసాగించాలనూ చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.
ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి. వారికి తగిన సాయం చేయాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లెక్కన ఏపీలో ఇకపై వాలంటీర్లు కనిపించే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.