ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ అన్నీ సజ్జలే!!
Advertisement
CJ Advs
అవును.. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి వరకూ సలహాదారుగా మాత్రమే పనిచేశారు కదా ఎంపీ ఎప్పుడయ్యారు..? ఇప్పుడిదే వైసీపీ కార్యకర్తలు, నేతల్లో వస్తున్న పెద్ద సందేహం..! అయినా 2024 ఎన్నికల్లో నలుగురు మాత్రమే ఎంపీలుగా గెలిచారు కదా.. ఇందులో ఆయన లేరు.. పోనీ రాజ్యసభ సభ్యుడా..? మూడో కంటికి తెలియకుండా ఎంపీ అయ్యారా.. అంటే అది అయ్యే పనీ కాదు కదా..? మరి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారు..? అనేది కార్యకర్తలు, నేతలు.. వీరాభిమానులకు ఐతే అర్థం కావట్లేదు కానీ సజ్జల, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకే తెలియాలి..!
కొన్ని రోజులు అంతే..!
2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో 151 అసెంబ్లీ సీట్లు దక్కించుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. 2024లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాల్లో గెలిచి క్రికెట్ టీంకు పరిమితం అయ్యింది. ఇందుకు కర్త, కర్మ, క్రియ ఒకే ఒక్కడు.. ఆయనే సజ్జల అన్నది పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్న మాట. సకల శాఖా మంత్రిగా.. ఆఖరికి షాడో సీఎంగా కూడా వ్యవహరించి పార్టీని ఈ పరిస్థితికి తెచ్చారని మండిపడుతున్నారు నేతలు. అంతేకాదు.. గ్రౌండ్ రియాలిటీని జగన్ రెడ్డికి చెప్పకుండా సజ్జల అడ్డుపడ్డారని.. ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, జనంతో కలవకుండా కోటరీ చెప్పుచేతల్లో ఉండటం వల్లే పార్టీ నాశనమైందని ఓడిపోయిన నేతలు గగ్గోలు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. ఆయన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని.. పదే పదే క్యాడర్ నుంచి వచ్చిన, వస్తున్న డిమాండ్. ఏం జరిగిందో కానీ కొద్ది రోజులపాటు సజ్జల కనిపించలేదు.. వినిపించలేదు..! ఎప్పుడైతే జగన్ మళ్ళీ సమావేశాలు, యాత్రలు, ధర్నాలు అంటున్నారో ఇక రంగంలోకి దిగిపోయారు.!
అవసరమా..?
సీఎం నుంచి మాజీ అయినా జగన్ రెడ్డికి ఎందుకో మార్పు కనిపించట్లేదు. సజ్జలను వదులుకోవడానికి ఎందుకో ఆయన అంత సుముఖంగా లేరు..! మీటింగ్ ఏదైనా సరే తగుదునమ్మా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వాలిపోతున్నారు! ఆ మధ్య ఎమ్మెల్యేలతో.. మొన్న ఎమ్మెల్సీలతో.. ఇప్పుడు ఏకంగా ఎంపీలతో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కనిపించారు. అదికూడా ముందు వరుసలో కూర్చోవడం గమనార్హం. దీంతో సజ్జలను ఒక రేంజిలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అవసరమా జగన్ అన్నా.. అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి.
ఇంకెన్ని చూడాలో..!
సలహాదారు పదవి పోయాక ఈయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. ఇప్పుడు ఏకంగా ఎంపీ అయ్యారు.. ఇన్ని వేరియేషన్లు ఎలా..? ఇక మిగిలింది ఒక్క పాత్రేనా.. అదేనండీ మాజీ సీఎం..! అని తిట్టేస్తున్నారు కార్యకర్తలు. ఇంత జరిగినా ఆయనను ఎందుకు వెంట పెట్టుకొని జగన్ తిరుగుతున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి..? అసలు క్యాడర్ కు ఎలాంటి సందేశం జగన్ ఇస్తున్నట్టు..? అని మాజీ సీఎంను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఐనా వైసీపీలో జగన్ రెడ్డికి తోడుగా ఉంటూ సలహాలు, సూచనలు చేసేవారు లేరా.. పోనీ సజ్జల పార్టీకి అవసరమా అని కానీ, ఇలాంటి సమావేశాలకు ఎందుకు అని కానీ అధినేతకు చెప్పే ధైర్యం ఏ నేతకు అయినా ఉందా.. లేదా! అన్నది క్యాడర్ నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకూ ఆయన పార్టీకి మూటగట్టిన అప్రదిష్ట చాలు.. ఇంకా ఏం చేయాలని అన్నారు..? మరో ఎదురుదెబ్బ తగీలేదాకా ఇలానే ఉంటుందేమో మరి..!
Jagan to hold meet with YSRCP leaders