అవును.. ఢిల్లీ వేదికగా ధర్నా చేయనున్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు..! వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఢిల్లీ వేదికగా ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఏపీలో పరిస్థితులపై బుధవారం నాడు (జులై-24) ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ఎంపీలు, MLAలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తామని తెలిపారు. తొలుత ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఇక ధర్నాకు దిగుతామని వినుకొండ వేదికగా జగన్ ప్రకటించారు.
ఢిల్లీలోనే ఎందుకు..?
వైఎస్ జగన్ ధర్నా చేస్తారని ప్రకటించారు సరే.. ఆంధ్రప్రదేశ్‌లో దాడులు జరుగుతుంటే దేశ రాజధాని న్యూ ఢిల్లీలో చేయాల్సిన అవసరమేంటి..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న పెద్ద చర్చ. ఏపీలో దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రాంతీయ పట్టించుకోలేదన్నది బహుశా వైఎస్ జగన్ అభిప్రాయ ఉండొచ్చు. అందుకే హస్తిన వేదికగా ధర్నాలు, నిరసనలు చేపడితే యావత్ భారతదేశం మొత్తం చూస్తుందని ఇక్కడ ప్లాన్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. అవసరమైతే పేరుగాంచిన ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలన్నది వైఎస్ జగన్ టార్గెట్ అని తెలిసింది.
అయ్యే పనేనా..?
ఈ మొత్తమ్మీద జగన్ కోరుకుంటున్నదేమిటంటే.. ఏపీలో రాష్ట్రపతి పాలన. అయినా ఇది అయ్యే పనేనా అంటే వందకు వెయ్యి శాతం కాదంటే కాదు..! ఏపీలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. మొత్తం టీడీపీ వాళ్లే చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని జగన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం.. 490 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులను టీడీపీ కార్యకర్తలు, నేతలు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వెయ్యికిపైగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయని వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీనే అని జగన్ చెబుతున్న పరిస్థితి. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలా జరుగుతోంది కాబట్టి రాష్ట్రపతి పాలన కావాలని జగన్ కోరుకుంటున్నారు. అయినా ధర్నా సంగతి దేవుడెరుగు..? మోదీ అపాయిట్మెంట్ ఆ తర్వాత ధర్నాకు అనుమతి ఏ మేరకు వస్తుంది..? ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే ఏ మాత్రం సక్సెస్ అవుతుందనేది చూడాలి మరి.