శివాజ్ఞ, శివానుగ్రహంతోనే ఈ జగత్తు నడుస్తుందని.. ‘ఆట కదరా శివా’తో లక్షలకొలదీ అభిమానుల్ని సంపాదించుకున్న విఖ్యాత రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి (Tanikella Bharani) కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని (Yadadri Temple) దర్శించుకున్నారు.
అనంతరం భరణి దంపతులకు ఆలయ సంప్రదాయానుసారం వేదపండితులు ఆశీర్వచనం చేసి మన్త్రమయ జ్ఞాపికలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) అపురూప గ్రంధాలను అందజేశారు.
తన భార్య దుర్గాభవాని జన్మదినోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చామని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం, అనుగ్రహం పుష్కలంగా లభించడంపట్ల తనికెళ్ళ భరణి ఆనందం వ్యక్తం చేశారు.
హృదయాన్ని కరిగించే భక్తినీ, అనితర సాధ్యమైన కవితా రీతిని మేళవించి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న అమోఘమైన రచనా సంకలన గ్రంథ వైభవం, ధార్మిక చైతన్యం అనితర సాధ్యమైనదని భరణి అభినందించారు. తనకి చాలాకాలంగా శ్రీనివాస్ దైవీయ స్పృహ, నిస్వార్థసేవ తెలుసని పండిత బృందంతో భరణి పేర్కొన్నారు.
తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, తిరుమలలోని వేంకటాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి, బెజవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధాలలో గత కొంతకాలం నుండీ విఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ (Gnana Maha Yagna Kendram) సంస్థ ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతమైన రచనా సంకలనాలు లక్షలకొలదీ భక్త గణాలకు ఉచితంగా అందజేస్తున్న విషయాన్ని యాదాద్రి శ్రీనివాస్ శర్మ తదితర పండిత వర్గాలు చెబుతూ.. మరొకసారి ప్రశంసలతో పురాణపండ శ్రీనివాస్ కృషిని అభినందించడం విశేషం. (Sri Lalitha Vishnu Sahasranama Stotram)
తనికెళ్ళ భరణి వెంట భార్య దుర్గా భవాని, కుమారుడు మహాతేజ తదితరులు ఉన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఏ.భాస్కర రావు వారిని ఎంతో ఆత్మీయంగా పలకరించడం విశేషం.