ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ కో ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మొదలుకుని అమిత్ షా.. ఇతర కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజిబిజీగా గడపనున్నారు. బాబు హస్తిన పర్యటనతో ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ఉండటం.. దీనికి ముందే ఢిల్లీ వెళ్లడంతో త్వరలోనే ఎన్డీఏ సర్కార్ నుంచి తీపి కబురు వస్తోందనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క కచ్చితంగా అనుకున్నది జరిగి తీరుతుంది.. కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని గట్టి ధీమాతో చంద్రబాబు ఉన్నారని సమాచారం.
ఇదీ అసలు కథ..!
బాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చాలా వరకూ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మొదట్నుంచి డిమాండ్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే.. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కర్త, కర్మ.. క్రియగా నిలిచిన చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఇప్పుడు ఏం అడిగినా ప్రధాని మోదీ, షా అస్సలు కాదనరు. అంతేకాదు.. ఒకవేళ కుదరదు అదీ ఇదీ అంటే మాత్రం ఇంకాస్త గట్టిగా అడిగితే కాదనే సమస్యే లేదు. ఎందుకంటే.. ఏ మాత్రం ఎన్డీఏ నుంచి తప్పుకున్నా సర్కార్ కుప్పకూలిపోతుందంతే.
అంతా రెడీనా..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక ప్యాకేజీ రెడీగా.. చంద్రబాబుతో అమిత్ షా, ప్రధాని సమావేశమైన తర్వాత ఓ క్లారిటీ వస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు కోడై కూస్తున్నాయి. మరోవైపు.. బీహార్‌కు కూడా ప్రత్యేక హోదా అడగ్గా.. ప్రత్యేక ప్యాకేజీనే కేంద్రం సిద్దం చేసిందని.. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ప్రకటన ఉంటుందని జాతీయ మీడియా చెబుతున్న మాట. అయితే.. అవకాశం ఉన్నప్పుడు హోదా అడగకుండా ప్యాకేజీ ఏమిటీ..? జుట్టు మన చేతిలో ఉన్నప్పుడు ఇలానే ఉంటే ఎలా..? ఇది ఎంతవరకు సబబు..? అంటూ రాష్ట్ర ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. కచ్చితంగా హోదానే బాబు పట్టుకొస్తారని.. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఇదే ప్రకటన ఉంటుందని కూటమి వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.