జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓ వర్గం మీడియా టార్గెట్ చేసిందా..? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ.. మరోవైపు పవన్‌ను ట్రోల్ చేస్తూ కార్టూన్‌లు షురూ చేసిందా..? అంటే తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కార్టూన్‌ను చూసి ఇదే అక్షరాలా నిజమని జనసేన కార్యకర్తలు, నేతలు.. మెగాభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా జనసేన నేతలే దీనిపై స్పందిస్తూ ఎల్లో మీడియా టార్గెట్ చేసిందని చెబుతుండటం గమనార్హం.
ఎందుకిలా..?
నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గురించి ఈనాడు దినపత్రికలో రోజుకో కార్టూన్ వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అవి ఎలా ఉండేవంటే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా.. ఆయన్ను ఓ కామాంధుడిలా ఇలా ఒకటా రెండా ఎన్నో రకాలు చిత్రీకరించింది ఈనాడు. అస్సలు ఆ కార్టూన్‌లు చూసి ఎన్టీఆర్ నిద్రలేని రాత్రులు గడిపినట్లు స్వయంగా మీడియా ముఖంగా చెప్పిన సందర్భాలు చాలనే ఉన్నాయ్. అటు ఆయన బాధపడగా.. మరో వర్గం నవ్వుకున్నది. ఇలా ఆ కార్టూన్లతో చాలానే క్షోభ పడ్డారాయన. సరిగ్గా ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ఆంధ్రజ్యోతిలో కార్టూన్ వెటకారంగా రావడంతో గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు జనాలు, అభిమానులు. పవన్ కళ్యాణ్‌ను ఎల్లో మీడియా టార్గెట్ చేసిందంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్‌ను ప్రధాని మోదీ ఎలా చూసుకుంటున్నారో.. ఏమేం మాట్లాడుతున్నారో..? ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బహుశా ఇదంతా టీడీపీ, అనుకూల దినపత్రికలు, టీవీలు జీర్ణించుకోలేకపోతున్నాయోమో అనే సందేహాలు జనసేన నేతల్లో వస్తున్నాయ్..! అయితే.. ఈ కార్టూన్‌లో తప్పేముంది.. అంత వ్యంగ్యం ఏమీ లేదని కొట్టిపారేసే వారూ ఉన్నారు.
ఇంత దారుణమా..?
ఏపీ ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలిచి100% స్ట్రైట్ రేటు దక్కించుకున్న జనసేన.. ప్రజాప్రతినిధుల సత్కార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నేను ప్రధాని గుండెల్లో ఉన్నా.. ఇక ఫొటో దిగాల్సిన అవసరం లేదు అని కామెంట్స్ చేశారు. దీన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ.. ఓ రైతు, పవన్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉన్నట్లుగా కార్టూన్ గీసింది ఆంధ్రజ్యోతి. దీనికి పోలవరం, విశాఖఉక్కు, అమరావతి కూడా ఆయన హృదయంలో ఉండేలా చూడండి సార్..! అంటూ ఆ రైతు చెబుతున్నట్లుగా సెటైరికల్‌గా ఉంది. దీన్ని పవన్ లైట్ తీసుకున్నా.. నేతలు, కార్యకర్తలు మాత్రం అస్సలు తీసుకోవట్లేదు.. అంతకుమించి జీర్ణించుకోలేకపోతున్నారు. పోనీ.. ఇలాగే చంద్రబాబుపై కార్టూన్ వేయగలరా..? అయినా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ.. పవన్ ట్రోల్ చేయడంలో ఆంతర్యమేంటి..? అనే ప్రశ్నలు జనసేన కార్యకర్తల్లో వస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రూటు మారుస్తూ కూటమి పార్టనర్ పరువు తీసే ప్రయత్నం జరుగుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న పరిస్థితి. మరోవైపు.. ఏపీలో చంద్రబాబు మార్క్ వెన్నుపోటు మొదలైందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీన్ని పవన్ ఎలా తీసుకుంటారో చూడాలి మరి.