వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి రీసెంట్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. విలక్షణ నటిగా సౌత్ సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ.. ఈ మధ్య చాలా బిజీ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీరోల సినిమాలలో ఆమెకు గొప్పగొప్ప పాత్రలు వస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలిగా నటబీభత్సాన్ని వరలక్ష్మీ ప్రదర్శించింది. అయితే ఇప్పుడు తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఆమె నటిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. వరలక్ష్మీనే దీనిపై క్లారిటీ ఇచ్చింది. తన భర్త నుంచి తనకు పర్మిషన్ వచ్చినట్లుగా తెలిసింది.
‘మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలతో నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను. అయితే పెళ్లి తర్వాత కూడా అందరి మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య చాలా మంది.. పెళ్ళి తర్వాత సినిమాల్లో నటిస్తావా? అంటూ అడుగుతున్నారు. తప్పకుండా నటిస్తాను. ఈ విషయంలో నా భర్త కూడా నాకు అనుమతి ఇస్తూ.. స్వయంగా ఆయనే క్లారిటీ కూడా ఇచ్చారు. ఇకపై కూడా సినిమాల్లో నటిస్తాను. ఇపుడు అంగీకరించిన చిత్రాలే కాకుండా కొత్త చిత్రాల్లో కూడా నటిస్తాను. సాధ్యమైనంత వరకు నేను చేయగలిగిన పాత్రలు చేస్తూనే ఉంటాను. పెళ్లి అయింది కదా అని నటనకు స్వస్తి చెప్పను’ అని వరలక్ష్మీ స్పష్టం చేసింది.
ఇక ఇదే విషయంపై వరలక్ష్మీ భర్త సచ్‌దేవ్ కూడా మాట్లాడారు. నా భార్య వరలక్ష్మీ పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తారు. ఆమె ఫస్ట్ లవ్ నేను కాను.. సినిమాలే. నేను సెకండ్ లవ్. పెళ్లి తర్వాత తను పేరు మార్చుకుంటానని చెప్పింది కానీ.. నేను అందుకు అంగీకరించలేదు. తన పేరు వరలక్ష్మీ శరత్ కుమారే. నా పేరునే నేను మార్చుకున్నాను. ఇకపై నా పేరును నికోలయ్ వరలక్ష్మి సచ్‌దేవ్‌గా మార్చుకుంటున్నాను. అందరి ఆశీస్సులు మాకు కావాలి.. అని వరలక్ష్మీ భర్త సచ్‌దేవ్ మీడియాకు తెలిపారు.