అపర కుబేరుడు, ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహ వేడుకపై హీరోయిన్ తాప్సీ చురకలంటించింది. రాధిక మర్చెంట్‌తో అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభవోపేతంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల నుంచి వార్తలలో ఉన్న ఈ వివాహ వేడుకకు ఎన్నో వేల కోట్లను ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టారు. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలను ఆహ్వానించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో అంబానీ ఇంట పెళ్లి అంబరాన్ని తలపించింది.
అయితే ఈ పెళ్లి వేడుకలపై, వెళ్లిన గెస్ట్‌లపై తాప్సీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆమెకు అంబానీ ఇంట పెళ్లిలో ఏ కార్యక్రమంలోనూ మీరు కనిపించలేదు, అందుకు కారణం ఏంటి? మీకు ఆహ్వానం అందలేదా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన తాప్సీ.. తను ఆ పెళ్లికి ఎందుకు వెళ్లలేదో కారణం చెబుతూనే.. వెళ్లిన వారిపై కూడా పంచులు పేల్చింది.
ఇంతకీ తాప్సీ ఏమందంటే.. నాకు అంబానీ ఫ్యామిలీతోకానీ, ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులతోగానీ వ్యక్తిగత పరిచయం లేదు. నా ఉద్దేశ్యంలో పెళ్లి అంటే అనుబంధాలతో కూడిన వేదిక మరియు వేడుక. పెళ్లికి పిలిచిన కుటుంబానికి, ఆ పెళ్లికి వెళ్లే కుటుంబానికి మధ్య ఏదో ఒక అనుబంధం ఉండాలి. అటువంటి పెళ్లిళ్లకు మాత్రమే నేను వెళతాను. ముక్కూ ముఖం తెలియని వారి పెళ్లి వేడుకకు వెళ్లి ఇబ్బంది పడలేను.. అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలపై పంచులు కూడా పేలుస్తున్నారు. నీకు ఆహ్వానం రాకపోతే రాలేదని చెప్పాలి కానీ.. ఆహ్వానం వచ్చి వెళ్లి వారిని అవమానపరిచేలా కామెంట్స్ చేయడం ఏంటని ఆమెను నిలదీస్తున్నారు.