అవును.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరం వచ్చింది..! ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉండగా.. ఈ రెండు పార్టీలే కాదు ఇప్పుడు వైసీపీ అవసరం కూడా వచ్చేసింది..! అది కూడా ఎంతో దూరంలో లేదు.. అతి సమీపంలోనే ఉంది..! అయినా.. వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది కదా.. ఇంకేం అవసరమబ్బా..? అని అనుకుంటున్నారు కదా.. అదేం లేదు.. పార్టీ అవసరం ఎంతైనా ఉంది..! ఆ లెక్కేంటో.. వైసీపీ ఆలోచనేంటో చూసేద్దాం వచ్చేయండి మరి..!
ఇదీ అసలు సంగతి!
కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఏ.. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేసుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభలో గట్టిగానే బలముంది.. ఇంకా కావాల్సిన బలం వచ్చి చేరుతుంది కూడా..! ఇప్పుడు చిక్కులొచ్చిందల్లా రాజ్యసభతోనే..! ఇక్కడ తగినంత బలం లేకపోవడంతో ఏన్డీఏతర పార్టీల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఎలాగంటే.. మొత్తం 245 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 101 సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 113. అంటే.. 12 మంది సభ్యులు ఎన్డీఏకు తక్కువగా ఉన్నారు. ఇక 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఈ స్థానాల్లో సగం కూడా గెలుచుకునే పరిస్థితుల్లో ఎన్డీఏ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. వైసీపీ (11), అన్నాడీఎంకే (03), బీఆర్ఎస్ (04), బీఎస్పీ (01) సభ్యులతో అవసరం వచ్చింది.
మీకేంటి.. మాకేంటి..?
వాస్తవానికి సందర్భం వచ్చినప్పుడల్లా.. అదేనండోయ్ బిల్లలు ఆమోదం కావాల్సి వచ్చినప్పుడల్లా రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇస్తూనే వస్తోంది..! ఇదేం ఆ పార్టీకి కొత్తేమీ కాదు..! అయితే ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పైగా ఇప్పుడు తన ప్రత్యర్థి పార్టీ ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండటంతో ఒకటికి పదిసార్లు మద్దతు అడగడానికి ఎన్డీఏ ఆలోచించాల్సిన పరిస్థితి. అడిగితే.. వైసీపీ మద్దతు ఇవ్వకపోతే దాన్ని జీర్ణించుకోవడం కూటమికి కష్టమే..! ఒకవేళ అడిగితే మాత్రం మాకేంటి..? అని జగన్ అండ్ కో ఎంపీలు అడగడానికి సిద్ధమయ్యారట. అది కూడా అక్రమాస్తుల కేసులో అరెస్ట్ నుంచి రక్షణ.. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి లోతులను తవ్వకుండా.. తమ పార్టీని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటే మద్దతు ఇవ్వడానికి రెడీగానే ఉందట. అంటే.. ఎన్డీఏకే కండిషన్లు పెట్టడానికి రెడీ అయ్యిందన్న మాట. ఇదే జరిగితే జగన్ సేఫ్ జోన్‌లో పడినట్లే.. అదే విధంగా ఎన్డీఏ అవసరం కూడా తీరిపోయినట్లే..! ఈ డిమాండ్లకు మోదీ ఒప్పుకుంటారా.. లేకుంటే మరో విధంగా ఏమైనా ఇదీ కాకుంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి.