బెంగళూరు.. బెంగళూరు.. బెంగళూరే నా ప్రాణం అన్నట్లుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బెంగళూరులో ఏముందో తెలియట్లేదు కానీ.. అధికారంలో ఉన్నన్ని రోజులు అటువైపు కూడా తొంగిచూడని ఆయన.. ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. ఎంతలా అంటే ఒక్కసారి వెళ్తే వారాలు తరబడి అక్కడే ఉండిపోతున్నారు. అక్కడ ఏం జరుగుతోందో.. జగన్ ఏం చేస్తున్నారో తెలియక క్యాడర్, నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
ఏం జరుగుతోందబ్బా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై క్రికెట్ టీమ్‌కు పరిమితమైన వైసీపీ.. క్యాడర్‌ను కాపాడుకుంటూ, ఈ ఐదేళ్లు ప్రజలతో మమేకం అవుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా.. కార్యకర్త మీద ఈగ కూడా వాలకుండా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడుకోవాల్సిందే.. అలా చేస్తేగానీ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టం. అలాంటిది.. ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రం మొదలుకుని నేటి వరకూ వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నేతలపై ఏ రేంజిలో దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో ఓ లుక్కేస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లిపోవాల్సిన జగన్ ఎందుకో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా కనిపించలేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు.
కరెక్టే కానీ..!
బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయ్.. ప్యాలెస్ ఉంది.. మిత్రులంతా అక్కడే ఉండొచ్చు గాక ఏపీ అనేది అంతకుమించి అనే విషయం మరిచిపోతే ఎలా జగన్..? పోనీ అక్కడికెళ్లి ఏదైనా వ్యూహ రచన చేయడం కానీ.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఏమైనా ఆలోచన ఉందా అంటే అదీ లేదే..! అలాంటప్పుడు క్యాడర్, ప్రజలను వదిలేసి అక్కడికెళ్లి చేసేదేముంది..? అనేది ఇప్పుడు కార్యకర్తల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది ఎవరో మరి. అయితే.. గతంలో జిమ్ చేస్తుండగా కాలు బెణగడంతో అది ఇప్పటికీ ఇబ్బంది పెడుతోందని అందుకే బెంగళూరుకు చికిత్స కోసం.. అవసరమైతే సర్జరీ చేయించుకోవాలని మాత్రమే ఈసారి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.