అవును.. మీరు వింటున్నది నిజమే..! అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిక్స్ అయ్యారని తెలిసింది..! ఇందుకు కారణాలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..! ఒకటా రెండా లెక్కలేనన్ని ఉన్నాయ్..! అవమానంగా భావించి సారు సమావేశాలకు వెళ్ళట్లేదని కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తుంటే.. సమస్యే లేదు బాస్ వస్తారు.. సర్కారును నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
ఏం జరుగుతుందో..?
జులై- 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 25 లేదా 26న వార్షిక బడ్జెట్ రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. 23న కేంద్ర బడ్జెట్ ఆ తర్వాత ఇక్కడ బడ్జెట్ ఉండనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇందుకు సంబంధించి సర్వం సిద్ధం చేస్తోంది ఆర్థిక శాఖ. ఈ బడ్జెట్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకున్న తర్వాత కావడంతో ప్రాధాన్యత ఉంటుంది. సమావేశాల్లో భాగంగా.. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించనున్నది ప్రభుత్వం.
సారు సంగతేంటి..?
అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ కావడం.. పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోవడం.. దీనికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. ఇంకో 20 మంది కూడా రెడీగా ఉన్నారని.. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంతా జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేలా టాక్ వినబడుతోంది. రోజు రోజుకు అసెంబ్లీలో బలం తగ్గిపోవడంతో.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ర్యాగింగ్ చేస్తుందని.. ఇది సారుకు అవమానంగా ఉంటుందని పార్టీ నేతలు ఆయనకు చెప్పారట. అందుకే వెళ్లి అవమానపడటం కంటే.. వెళ్ళకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారట.
ఆ ఇద్దరే..!
ఇక అసెంబ్లీలో ఏం మాట్లాడాలి..? ఎలా మాట్లాడాలి..? అనే విషయాలను కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారని తెల్సింది. సమావేశాల్లో ప్రజాసమస్యలు, పాలనపరమైన నిర్ణయాలతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్‌ను కడిగిపారేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. రైతుభరోసా, రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని అంశాలపై కూడా వాడి వేడి చర్చ జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.