అవును.. ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే..! కూటమి అధికారంలోకి వచ్చిన తరవాత వరుస ఆయా శాఖల అధికారులతో సమావేశాలు, సమీక్షలతో బిజీబిజీగా ఉన్నారు. ఇక వీలు దొరికినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. ఐతే ఒక్కోసారి మీడియా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తీవ్ర అసహనం చూపిస్తున్న పరిస్థితి..! మొన్న ఆ మధ్య చంద్రబాబు.. ఇవాళ పవన్ కళ్యాణ్ మీడియా ముందే మైక్ పడేసి.. మాట్లాడే మూడ్ ఉత్సాహం లేదని వెళ్ళిపోయారు..!
ఏంటి తమాషాగా ఉందా..?
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు వరుస శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం, కరెంట్ చార్జీలపై శ్వేత పత్రాలు రిలీజ్ చేసింది. పవర్ చార్జీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో సాంకేతిక లోపాలు తలెత్తగా (స్క్రీన్ లో రావాల్సినది కాకుండా మరొకటి రావడం) ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు బాబు. ఇది కూడా మీరే ఆపరేట్ చేస్తున్నరేటి..? ఏమిటీ కన్ఫ్యూజన్.. రెండూ రెండుగా ఉన్నాయ్.. ఒళ్ళు దగ్గరపెట్టుకుని పని చేయండి.. తమశాలుగా ఉందా..? అని చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటనతో సమావేశంలో ఉన్న అధికారులు, మీడియా మిత్రులు షాక్ అయ్యారు.
మూడ్.. ఉత్సాహం.. మొత్తం..!!
శుక్రవారం నాడు.. పంచాయతీ రాజ్ శాఖపై సంబంధిత అధికారులతో మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కొందరు అధికారులు అడ్డురావడం, మరోసారి విలేకర్లు అడ్డు తగలడం.. మరోసారి ఏకంగా మైక్ పని చేయకపోవడంతో చేతిలోని మైక్ కింద పడేసి వేగంగా మీడియా మీట్ నుంచి వెళ్లిపోయారు. అదేదో అంటారే మాట్లాడే మూడ్, ఉత్సాహం మొత్తం పోయిందన్నట్లుగా మైక్ పడేసి వెళ్ళారు డిప్యూటీ సీఎం. సార్ ఏంటి ఇలా వెళ్లిపోయారని అధికారులు.. సమాధానం చెప్పలేదేంటి..? అని మీడియా ప్రతినిధులు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. అసలు ఏం క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా జరిగింది..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఎక్కడ చూసినా ఇదే!
ప్రస్తుతం సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎంల అసహనం తాలూకు వీడియోలు ఒక రేంజిలో వైరల్ అవుతున్నాయ్. ఇక కామెంట్స్ గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక దీన్నే సువర్ణావకాశంగా మలుచుకున్న వైసీపీ మీమ్స్, వీడియో ట్రోల్లింగ్ చేస్తున్న పరిస్థితి. ఫ్రస్టేషన్ ఎందుకు..? అక్కడ ఏం జరిగింది..? అని నలుగురు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఐనా ఇప్పుడు సోషల్ మీడియా కాలం కదా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా.. ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. చూశారుగా.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు సంబంధించి నెట్టింటోలో నడుస్తున్న చర్చ.