అవును.. మీరు వింటున్నది నిజమే..! ఏపీ సీఎం నారా చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి.. నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి గురుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజకీయాలు, వ్యాపారాలు బ్రాహ్మణికి కొత్తేమీ కాదు. ఈ రెండు రంగాల్లో ఈమె రాణించగలరు. ఇప్పటికే హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్నారు. నాటికి.. నేటికీ హెరిటేజ్ ఈ స్థాయిలో ఉందంటే ఇందులో కీలక పాత్ర బ్రాహ్మణి దే. ఐతే.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణించాలని అదికూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సుకత చూపిస్తున్నారని తెలిసింది. దీంతో టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బాలయ్య కూడా ఒప్పుకున్నారట.
నాడు.. నేడు..!
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుకుని నిన్న మొన్నటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్ళు అని చంద్రబాబు చెబుతున్న మాటలు మనం వింటూనే ఉన్నాం. నిన్న, మొన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు టీడీపీ లెక్క వేరు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీని మళ్ళీ లేపాలని విశ్వ ప్రయత్నాలు ఐతే జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. ఉన్న కారు పార్టీని ఖాళీ చేసే కాంగ్రెస్ కండువాలు కప్పే పనిలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక బీజేపీ అంటారా పర్లేదు.. సో చెప్పుకునేంత ప్రతిపక్షం ఐతే లేదు. పైగా ఈ రెండు పార్టీలతో పోలిస్తే టీడీపీ యాక్టివ్ ఐతే భారీగానే చేరికలు ఉంటాయ్. అందుకే.. ఇక పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. బ్రాహ్మణి తన మనసులోని మాట బయట పెట్టడంతో తెలంగాణ బాధ్యతలను కట్టబెట్టాలని హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఏం చేయొచ్చు..?
బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఈ పదవి లేని పక్షంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని కూడా చర్చ ఐతే జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే టీడీపీ పెద్దల నుంచి ఇందుకు సంబంధించి కీలక ప్రకటన రానున్నది. అయినా బ్రాహ్మణికి రాజకీయాలు ఏమీ కొత్త కాదు.. ఇప్పటికే తాను ఏంటో నిరూపించుకున్నారు. ఎలాగంటే.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ కూడా జైలుకు వెళ్తారని టాక్ నడిచింది. నాడే బ్రాహ్మణికి పగ్గాలు వస్తాయని చర్చ జరిగింది. కానీ లోకేష్ అరెస్ట్ ఆగడంతో అదేమీ జరగలేదు. ఐనా సరే.. నిజం గెలవాలి అని ఒకవైపు బాబు సతీమణి నారా భువనేశ్వరి.. మరోవైపు బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేశారు. కీలక ప్రసంగాలు చేసి పంచ్ డైలాగులు కూడా పేల్చారు. నాడే ఈమె స్టామినా ఏంటో తెలుగు ప్రజానీకానికి తెలిసింది.
భాగ్యనగరంలో ఇలా..!
ఇక సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతే కాదండోయ్ భారీ మెజారిటీ రావడంలో కూడా కర్త, కర్మ, క్రియ.. బ్రాహ్మణియే. దీనితో పాటు హైదరాబాద్ వేదికగా సెటిలర్స్, ఐటీ పీపుల్, టీడీపీ అభిమానులతో ధర్నాలు చేయించడంలోనూ బ్రాహ్మణి ప్లాన్ అని చెబుతూ ఉంటారు. అందుకే.. తెలంగాణ టీడీపీకి బ్రాహ్మణి సెట్ అవుతుందని పెద్దలు భావిస్తున్నారు అని తెలుస్తోంది. మరి ఎప్పుడైనా ప్రకటన రావొచ్చని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రకటన ఎప్పుడో.. ఇందులో నిజమెంత .. ఏం జరుగుతుందో చూడాలి మరి..!