అవును.. ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీకి పోలేదేం! సీఎం చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా ఉంటే పవన్ కళ్యాణ్ ఏపీలో ఏం చేస్తున్నట్లు..? బాబు పిలవలేదా..? సేనానికి వీలు కాలేదా..? ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఏమైనా వచ్చాయా..? లేకుంటే మరేదైనా జరిగిందా..? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ..! ఇక సోషల్ మీడియాలో ఐతే పెద్ద రచ్చే జరుగుతోంది..! టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తల మధ్య ఐతే ఒక రేంజిలో తిట్లు, కౌంటర్లు పేలుతున్నాయ్. ఆంధ్రాను.. తెలంగాణాతో పోల్చి మరీ ఇదేందబ్బా.. అప్పుడే ఏమైంది..? మూడునాళ్ల ముచ్చటేనా..? అన్నట్లుగా జనసేన కార్యకర్తలు, అభిమానులు, నేతల్లో ఎక్కడలేని అనుమానాలు వస్తున్న పరిస్థితి.
అసలేం జరుగుతోంది..!?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల కేంద్ర మంత్రులు మొదలుకుని ప్రధాని నరేంద్ర మోదీ వరకూ వరుస భేటీలతో బిజిబిజీగా గడుపుతున్నారు. తమ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టులు.. ఇలా ఎన్నో విషయాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తీసుకెళ్లగా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తీసుకెళ్లలేదు. ఇప్పుడిదే చర్చ. పోనీ బాబు ఒక్కరే వెళ్ళారా..? అంటే అదీ లేదే.. మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ ఉన్నారు. ఇందరు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం ఎందుకు లేరు..? అన్నది ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇంత కీలకం ఐనా..?
ఏపీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలపై ఇప్పుడు ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులు, ప్రధానితో చర్చలు జరుగుతున్నాయి. ఇంతటి కీలక సమావేశానికి చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెడుతున్నారా..? లేకుంటే డిప్యూటీకి వీలు కాలేదు గనుక బాబు తన టీంతో వెళ్ళారా..? అన్నది తెలియట్లేదు. వాస్తవానికి పిఠాపురం పర్యటనలో పవన్ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా కాకినాడ, గొల్లప్రోలు ఇలా అన్ని చోట్లా పవన్ కనిపిస్తున్నారు. తనను అక్కున చేర్చుకుని, గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ.. నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల భూమి కూడా కొన్నారు పవన్. ముందుగా అనుకున్న షెడ్యూల్ కావడంతో డిప్యూటీకి వీలు కాలేదని తెలుస్తోంది. ఇందులో ఏది నిజమో.. ఏదీ ఆపద్దమో పైనున్న పెరుమాల్లకే ఎరుక..!
ఇటీవల ఇలా..!?
ఈ మధ్యనే పెన్షన్లు పంపిణీ విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు మధ్య ఎన్ని చోట్ల ఎన్నెన్ని గొడవలు జరిగాయో తెలియంది కాదు. దీనికి తోడు ఇదే పింఛన్లపై పత్రికలకు ఇచ్చిన ప్రకటనలలో కూడా పవన్ ఫోటో ఎక్కడా లేదు. పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజావేదిక కార్యక్రమాన్ని బాబు నిర్వహిస్తే కనీసం ఇందులోనూ సేనాని ఫోటో లేకపోవడం గమనార్హం. అందులోనూ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పంపిణిలో ఇలా జరగడంతో అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు మొదలుకుని కూటమి కట్టి, ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా డిప్యూటీ సీఎం, కోరిన శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు. ఇక్కడి వరకు అంతా ఓకే కానీ ప్రమాణానికి ముందు ఢిల్లీలో ఇద్దరూ కలసి పయనించి.. ఇప్పుడు బాబు కెక్కటే హస్తినకు వెళ్లి ఇలా పర్యటన చేయడం ఎంత వరకు సబబు..? అనేది చంద్రబాబుకు, పవన్ కే తెలియాలి. ఈ మొత్తం వ్యవహారంపై ఎవరో ఒకరు లేదా.. రెండు పార్టీల్లో ఏదో ఒక లీడర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే కానీ.. ఈ హడావుడి, అస్మ్ట్ అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.