ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై పక్కా ప్లాన్‌తో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారా..? మీడియా, సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేసేస్తున్నారా..? ఏపీలో వైసీపీ.. ఢిల్లీ వేదికగా మరికొన్ని పార్టీలు రాజకీయ, వ్యాపార పరంగా టార్గెట్ చేశాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక్క మనిషి రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసినా.. అనుకున్నది చేసినా ఇలానే ఉంటుందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకింత రచ్చ.. దేశంలో ఇంత మంది ముఖ్యమంత్రులు ఉండగా బాబునే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు కథ!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రంలోనూ మంత్రి పదవులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు, మోదీనే మళ్లీ ప్రధాని కావడానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అందుకే బాబు ఈ క్షణాన యూటర్న్ తీసుకున్నా సరే మోదీ సర్కార్ కుప్పకూలిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమికి బాగా కడుపు ఉబ్బరంగా ఉంది. ఆ కూటమిలోని పార్టీలు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఏకంగా పార్లమెంట్ వేదికగానే.. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిప్పులు చెరుగుతూ మాట్లాడారు. చంద్రబాబును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రశ్నించారు. ఆయన అవినీతి పరుడు కాదా..? ఒక్క చంద్రబాబే కాదు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ ఇలా బీజేపీతో చేతులు కలిపిన వారిపై కేసులు లేకుండా ఎందుకు చేశారు. కాషాయ పార్టీలో చేరిపోతే వాషింగ్ మిషన్‌లో వేసినట్లా అని దుయ్యబట్టారు. అంతేకాదు.. టీడీపీ అగ్రనేత ఒకేరోజులో రూ.521 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు..? ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేశారు.
వైసీపీ కూడా..!
ఏపీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా సరే చంద్రబాబుకు ఆపాదించేస్తూ.. ఏంటి బాబు తమరి పాలనలో ఇది అంటూ మీడియా ముందుకు వచ్చేయడం.. ఇక ఎలాగో సోషల్ మీడియాలో ఓ రేంజిలో నెగిటివ్ ప్రచారం చేయడం షరా మూమూలు అయిపోయింది. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సరే ఇదే తంతు నడుస్తోంది. ఇక ప్రత్యేక హోదా విషయంలోనూ బీహార్ అడగడంతో ఆంధ్రప్రదేశ్ సంగతేంటి..? కేంద్రంలో అన్నీ మీరైనప్పటికీ ఎందుకు అడగట్లేదు అని ప్రశ్నిస్తోంది. పనిలో పనిగా తమ తప్పు ఏమీ లేదని చెప్పుకోవడానికి లోక్‌సభ, రాజ్యసభలో ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. మాట తప్పడం పద్ధతి కాదని.. హోదా అనేది హక్కు అని వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయిస్తున్నారు. దీంతో చంద్రబాబును అడ్డంగా బుక్ చేసినట్లే.. ప్రజలు ఆలోచింపజేసేలా ఒక మెసేజ్ తీసుకెళ్లినట్లేనన్నది వైసీపీ భావన. చూశారుగా.. గల్లీలో వైసీపీ.. ఢిల్లీలో కూటమి పార్టీలు ఎలా ఎంతలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాయో.. దీనంతటినీ కవర్ చేయలేక చంద్రబాబు అనుకూల మీడియా నానా తంటాలు పడుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. వైసీపీని ఓడించారని వైఎస్ జగన్.. తమకు మద్దతివ్వలేదు కదా అని ఇండియా కూటమి ఎన్నెన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ప్రత్యేక హోదా తేవాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు కానీ.. ప్రతిదీ చంద్రబాబుకు అంటగట్టడం, ఇక తృణమూల్ కాంగ్రెస్ టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే ఏదో జరుగుతోందనే చెప్పుకోవాలి. సో.. ఇండియా కూటమి కడుపు ఉబ్బరంగా చూపిస్తుండటంతో వైసీపీ చల్లబడుతోందేమో మరి.!