పప్పు అన్నారు.. పైసాకు కూడా పనికిరాడన్నారు..! అబ్బే రాజభోగం అనుభవించడానికి తప్ప రాజకీయాలకు అస్సలు సూట్ కాడన్నారు..! ఎలా ఉన్న గాంధీల ఫ్యామిలీలో ఇలాంటోడు వచ్చాడేంటి..? దేశాన్ని ఏలిన కుటుంబం నుంచి వచ్చి హీరో అనిపించుకోవాల్సింది పోయి జీరో అయ్యాడేంటి..? ఆఖరికి పండిత పుత్ర.. అని కూడా అనేశారు..! విదేశాలకు వెళ్లడం, పబ్బుల్లో ఎంజాయ్ చేయడానికి తప్ప దేనికి పనికిరాడని ఒక్కటే తిట్లు..! ఇలా ఒకటా రెండా ఇష్టమొచ్చినట్లు సభలు, సమావేశాలు ఆఖరికి పార్లమెంట్ వేదికగా కూడా తిట్టిపోసేశారు..! బీజేపీ కార్యకర్తలు, నేతలు మొదలుకుని ప్రధాని వరకూ అందరూ తిట్టిన తిట్టు తిట్టడకుండా తిట్టినవారే..!. ఇదంతా ఎవరి గురుంచి అనేది ఈపాటికే అర్థం అయ్యి ఉంటుంది కదా.. ఆయన మరెవరో కాదండోయ్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
ఎంత మార్పు వచ్చిందో..?
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క..! మొత్తం మారిపోయింది. అసలు ఈయన రాహుల్ గాంధీయేనా అని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. కార్యకర్తలు మొదలుకుని నేతలు, కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు ఆయన్ను ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్ వేదికగా రాహుల్ చేసిన ప్రసంగంతో వావ్ రాహుల్ 2.0 వచ్చేశారని అనుకుంటున్నారు. ఆయన దెబ్బకు పార్లమెంట్ దద్దరిల్లింది.. ఒకటా రెండా మొత్తం అన్ని అంశాలు టచ్ చేసి.. బీజేపీ సభ్యులు తెల్ల మొహాలు వేసేలా చేసిన పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాని మోడీ కూసాలు కదిలాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.
చుక్కలే.. చుక్కలు..!
ఒకే ఒక్కడు.. రాహుల్ సభలో మాట్లాడుతున్నంత సేపూ అధికారపక్ష సభ్యులు అంతా తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అసలు ఈయన రాహుల్ గాంధీయేనా..? అని ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన ప్రసంగంతో పార్లమెంటులో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు మసకబారిన తన శోభ మరోవైపు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడయ్యాక విసురుతున్న మాటలతూటాలతో ఎంత మార్పు ఏం కథ..? అంటున్నారు జనాలు. అవును జనం కోరుకున్నది కూడా ఇలాంటి రాహుల్‌నే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన పాదయాత్రతో బీభత్సమైన మైలేజ్ వచ్చింది ఇంకా చెప్పాలంటే.. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కట్టి ఎన్డీఏ కూటమికి చావుదప్పి కన్ను లొట్టబోయినట్టుగా అయ్యింది. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు యువనేత. చూశారుగా.. ఇంకా రాహుల్ గాంధీని పప్పు అని ఎవరైనా అంటారా..!