మాస్ కా దాస్ విశ్వక్సేన్ పేరు వినగానే మాస్ హీరోనే గుర్తొస్తాడు. ఆయన మాట్లాడే భాష, ఉండే విధానం (యాటిట్యూడ్) అన్నీ కూడా ఊర మాస్ అనేలా ఉంటాయి. అందుకే మాస్ కా దాస్ అని విశ్వక్‌ని పిలుస్తుంటారు. అలాంటి మాస్ హీరో ఇప్పుడు అమ్మాయి అవతార్‌లో కనిపించబోతున్నాడు. అవును.. ఒక రాజేంద్ర ప్రసాద్, ఒక సీనియర్ నరేష్.. ఇప్పుడు ఒక విశ్వక్సేన్. హీరోలు అమ్మాయిగా నటించిన వారి జాబితాలోకి విశ్వక్సేన్ చేరుతున్నాడు. ఆయన అమ్మాయి అవతారంలో నటించబోతోన్న చిత్రం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
విశ్వక్ సేన్ హీరోగా.. కాదు కాదు అమ్మాయిగా నటించే సినిమా పేరు లైలా. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ వదిలారు. ఆడాళ్లు సైతం కుళ్లుకునేంత అందంగా విశ్వక్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఏదో విభిన్నమైన చిత్రంగా విశ్వక్ కెరీర్‌లో నిలిచిపోనుందనేది ఈ ఫస్ట్ లుక్‌తోనే తెలిసిపోతుండటం విశేషం. ఎందుకంటే, నటులు అన్నాక అన్ని పాత్రలు చేయాలని మొదటి నుంచి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. విశ్వక్ విషయానికి వస్తే.. క్లాస్‌గానూ, మాస్‌గానూ అన్ని తరహా పాత్రలు చేస్తూ.. చాలా తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును పొందారు.
ఇంకా చెప్పాలంటే సినిమా సినిమాకూ తన వైవిధ్యతను చాటుతున్నాడు. ఇప్పుడు విశ్వక్ ఉన్న స్టేజ్‌లో లైలా వంటి సినిమా ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే. మరి ఈ సినిమాలో ఆయన పాత్ర తీరు తెన్నులు ఎలా ఉండబోతున్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమాను రామ్ నారాయణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.