చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ఓ కండీషన్ పెట్టారు. ఇకపై తమ సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వచ్చే వారంతా.. తప్పని సరిగా డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ప్రకటనలు రూపొందించానేలా షరతు విధించారు. మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే వీడియో చేశారో.. అలా చేయాల్సిందేనంటూ ఓ ఉదాహరణ కూడా చూపించారు. ఈ ప్రకటనపై అందరూ.. మంచి నిర్ణయం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి షరతుపై స్పందించారు.
అందరికీ నమస్కారం... ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డిగారు ఈ డ్రగ్స్ మహమ్మారికి యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ, చలనచిత్ర నటీనటులను 1, 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు నేను కొన్ని చేసి వున్నాను. అయినా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను సందేశాత్మకమైన కొన్ని వీడియోలు చేసి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను.. అని మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ వల్ల యువత ఎలాంటి పెడదోవ పడుతుందో కళ్లకు కట్టినట్లుగా ఓ వీడియోని విడుదల చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవిగారిలా అందరూ చేయాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి.. మరోసారి మెగాస్టార్‌ని హైలెట్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతుండటం విశేషం. ఏదయితేనేం.. ఒక మంచి పనికి మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.