టైటిల్ చూడగానే అవునా.. అదేంటి అనుకుంటున్నారు కదా..! మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోలిస్తే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో బెటర్! అది కూడా పది కాదు, వంద కాదు.. వెయ్యిరెట్లు బెటర్..! ఇంతకీ ఏ విషయంలో ఇంతగా బెటర్ అంటున్నారు..? సేనాని చేసిన అంత ఘనకార్యమేంటి..? అసలు జగన్‌తో పవన్‌కు పోలికేంటబ్బా..? అనే సందేహాలు మీ మెదడులో మెదులుతున్నాయ్ కదూ.. ఇంకెందుకు ఆలస్యం వాటన్నింటికీ సమాధానాలు దొరుకుతాయ్ ఇటు వచ్చేయండి మరి..!
ఎందుకు.. ఎలా..!
అక్షరాలా జగన్ కంటే పవన్ ఎంతో బెటర్. ఒకటా రెండా ఎన్నో విషయాల్లో ఎంతో బెటర్ అంతే..! ఎన్నికల ముందు నుంచి కాస్త నిశితంగా పరిశీలిస్తే.. నేటి వరకూ ఎక్కడా సేనాని నోరు జారిన దాఖలాల్లేవ్. అంతేకాదు.. వైసీపీ అధినేత ఎమ్మెల్యేగా, సీఎంగా రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు. పవన్ అదికూడా తీసుకోలేదు. అంటే జీతం అస్సలు తీసుకోకుండా జీరో జీతంతో పనిచేస్తారన్న మాట. తొలుత జీతం తీసుకుని దాన్ని రైతుల కోసం వినియోగించాలని భావించినప్పటికీ.. ఏపీలో నెలకొన్న పరిస్థితుల రీత్యా జీతం వద్దనుకున్నారు. అప్పులు చేసి జీతం తీసుకునే పరిస్థితి రావొద్దని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు సేనాని. అసలే పంచాయతీ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియట్లేదని.. ఈ కారణంతోనే తాను తీసుకోవట్లేదని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా మనసులో మాటను బయటపెట్టారు. ఇక.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడనని.. కూటమికి ఓటేసిన వారితో పాటు.. ఓటు వేయని వారు కూడా ప్రశ్నించొచ్చని కూడా బల్లగుద్ధి మరీ పవన్ చెప్పడం ఆయన నిజాయితీని మెచ్చుకోవచ్చు. ఈ విషయంలో జగన్ ఎక్కడున్నారో పాయింట్ అవుట్ చేసి మరీ చెప్పనక్కర్లేదు అనుకుంటాను..!
ఇది కదా కిక్కు..!
వైసీపీ హయాంలో ఇల్లు మొదలుకుని ఆఫీసు వరకూ ఏ రేంజిలో కట్టుకున్నారో జగన్ కట్టిన నిర్మాణాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందుకు రుషికొండ రాజ్ మహల్, తాడేపల్లి ప్యాలెస్.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలే చక్కటి ఉదాహరణ. అయితే పవన్ మాత్రం తాను సింపుల్‌గానే పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని తేల్చి చెప్పేశారు. అది కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అని కూడా చెప్పేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తన ఇంటిని క్యాంపు ఆఫీసుగా మార్చుకున్న జగన్.. కోట్లు విలువ చేసే ఫర్నీచర్‌ను ఇప్పటికీ అలాగే తన ఇంట్లోనే పెట్టుకున్నారు. దీంతో ఫర్నీచర్ దొంగ అని పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ దీనిపై వివాదం నడుస్తున్నది. ఇక పవన్ అయితే.. తన కార్యాలయంలో మరమ్మత్తులు మొదలుకుని ఎలాంటి కొత్త ఫర్నీచర్ వద్దని.. కొత్తగా కొనవద్దని అధికారులను సేనాని ఆదేశించారు. అంతకాదండోయ్.. కావాల్సిన ఫర్నీచర్ తానే తెచ్చుకుంటానని పవన్ చెప్పడం విశేషం. ఇదే పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్‌కు కిక్కించే విషయం అని చెప్పుకోవచ్చు. చూశారుగా.. పవన్‌కు జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పడానికి ఇంతకుమించి ఇంకేం ఉదాహరణలు కావాలి..! అయితే.. దీనిపై వైసీపీ ఒంటికాలిపై లేస్తోంది.. అసలు ఎవర్ని ఎవరితో పోలుస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతోంది. వైసీపీ-జనసేన కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య ఒకింత వార్ నడుస్తోంది.