పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అంటే ఆయన కటౌట్ కి తగిన కథ, ఆ కటౌట్ కి తగ్గ యాక్షన్ సీక్వెన్స్ వుంటే అభిమానులే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు అని బాహుబలి చిత్రం నిరూపించింది. ఆ చిత్రంలో ప్రభాస్ ఎంతగా కష్టపడినా ఆ చిత్రాన్ని మాస్ దగ్గర నుంచి క్లాస్ ఆడియెన్ దగ్గరకి రాజమౌళి తీసుకేళ్లారు. సినిమాని డే అండ్ నైట్ కష్టపడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాదు.. అది ఆడియన్స్ కి ఎలా చేరవేయాల్లో రాజమౌళిని చూసి నేర్చుకోవాలి.
కానీ ప్రభాస్ తో సినిమాలు చేసే దర్శకులు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ సినిమాలు పూర్తి చేసేసి సినిమా విడుదల వరకు దానిని చెక్కుతూ పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ దగ్గరకి తీసుకెళ్లే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇప్పుడొచ్చిన కల్కి 2898 AD చిత్ర దర్శకులు వరసగా అదే తప్పు చేసారు.
సినిమా విడుదలకు ముందు సినిమాని ఎంతగా, ఎలా ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన చెయ్యడం లేదు. ప్రభాస్ తో సినిమా చేసాం అంతే చాలు. అంత పెద్ద స్టార్ ని ప్రమోషన్స్ కి రమ్మని ఏం అడుగుతామని అనుకుంటున్నారో లేదంటే మీడియా ముందుకు వచ్చేందుకు ప్రభాస్ ఇష్టపడడం లేదో కానీ.. ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ వీక్ అనేది పదే పదే రిపీట్ అవుతూనే ఉన్నాయ్.
మరి ప్రభాస్ తో తదుపరి సినిమాలు చేసే దర్శకులైనా ఆ ప్రమోషన్స్ విషయంలో లెక్కలు వేసుకుంటారో లేదంటే వీరినే ఫాలో అవుతారో అనేది కాలమే నిర్ణయించాలి