అవును.. తెలంగాణలో ఆరు మంత్రి పదవుల కోసం ఎందరో ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి..! ఇందులో కాంగ్రెస్ సీనియర్, జూనియర్లు ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు పార్టీలోకి గెలిచిన వారు సైతం ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు కోసం తక్కువలో తక్కువ 60 మంది ఆశావహులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి. అదృష్టం ఎవర్ని వరిస్తుందో కానీ.. జాక్‌పాట్ కొట్టినట్లేనని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఖాళీగా ఉన్నవన్నీ కీలక శాఖలే.. ఇందులో విద్యా, హోం శాఖలు కూడా ఉన్నాయి.
రేసులో ఎవరెవరు..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎంగా రేవంత్ రెడ్డి.. కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. కీలక శాఖలన్నీ రేవంత్ దగ్గర ఉన్నాయి. అయితే.. వాటిని వేరొకరికి కేటాయించడం కానీ, కేబినెట్ విస్తరణ కానీ 200 రోజులు దాటినా ఇంతవరకూ చేయలేదు. దీంతో.. విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వేదికగా దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బల్మూరి వెంకట్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, నలమాద పద్మావతి రెడ్డి, మదన్ మోహన్ రావు, పి. సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరిలతో పాటు మరికొందరు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.
మాకు.. కాదు మాకే..!
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పదవి కాలం ముగిసింది. ఆయన స్థానంలో ఎవరనే దానిపై ఇంకా ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ పదవి ఎవరికి అనేదానిపై క్లారిటీ వస్తే.. రోజుల వ్యవధిలోనే మంత్రి వర్గ విస్తరణ చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఏం చేసైనా సరే మంత్రి పదవి దక్కించుకోవాలని ఫైరవీలు మొదలుపెట్టారు ఎమ్మెల్యేలు. కొందరు రేవంత్ రెడ్డిని.. మరికొందరు సోనియా గాంధీ, ఇంకొందరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో టచ్‌లోకి పదవులు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే.. ఇప్పటి వరకూ మైనార్టీ కోటాలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు గనుక.. తనకు కచ్చితంగా పదవి వస్తుందని, అస్సలు ప్రయత్నాలు చేయాల్సిన అక్కర్లేదని రేవంత్ రెడ్డే తనకు మంత్రి పదవి ఇప్పిస్తారని ధీమాతో షబ్బీర్ అలీ ఉన్నారు. ఇక మేధావుల వర్గం కింద తనకి మంత్రి పదవి వస్తుందని ఎప్పట్నుంచో కోదండరాం ఆశిస్తున్నారు. ఇక జంపింగ్ ఎమ్మెల్యేల్లో పోచారం, కడియం, దానం రేసులో ఉన్నారు. కడియంను విద్యాశాఖ వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.